తెలంగాణలో మళ్ళీ కుంభవృష్టి!

September 12, 2025
img

వాతావరణ శాఖ చెప్పినట్లుగానే హైదరాబాద్‌తో రాష్ట్రంలో పలు జిల్లాలలో గురువారం ఉదయం నుంచే భారీగా వర్షం మొదలై గంటలు గడుస్తున్నా ఆగకుండా కురుస్తూనే ఉంది.

ఇదివరకు భారీ వర్షాలు పాడినప్పుడు కామారెడ్డి జిల్లా అతలాకుతలం కాగా ఈసారి మెదక్ జిల్లాపై అటువంటి ప్రభావం కనిపిస్తోంది. మెదక్ జిల్లాలో అత్యధికంగా 17.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, యాద్రాది భువనగిరి జిల్లాలో 17.3, సిద్ధిపేటలో 13.5, రంగారెడ్డిలో 12.3 హనుమకొండలో 11.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. 

మెదక్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలలో ఇళ్ళు, దుకాణాలలోకి వర్షం నీరు ప్రవేశించింది. మెదక్-హైదరాబాద్‌ ప్రధాన రహదారి, మహాత్మా గాంధీ రోడ్డు, రాందాస్ చౌరస్తా, ఆటోనగర్, గాంధీ నగర్‌ తదితర ప్రాంతాలలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. 

హయత్ నగర్‌, వనస్థలిపురం, పెద్ద అంబార పేట తదితర ప్రాంతాలలో కురిసిన వర్షానికి భారీగా నీళ్ళు నిలిచిపోయాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది.  

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో రత్నాలవాగుపై గల వంతెనపై నుండి వరద నీళ్ళు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఇరువైపులా బ్యారికేడ్లు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. 

రేపు శనివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. 

Related Post