బీసీ రిజర్వేషన్స్‌కు గవర్నర్ ఆమోదం... శుభం!

September 12, 2025


img

స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్‌ కేటాయించేందుకు మార్గం సుగమం అయ్యింది. దీని కోసం శాసనసభలో పంచాయితీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణ చేసి రిజర్వేషన్స్‌ గరిష్ట పరిమితి 50 శాతంని రద్దు చేసింది. శాసనసభ ఆమోదించిన ఈ బిల్లుని తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ కూడా ఆమోదం తెలిపారు. 

ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడగానే, దాని ఆధారంగా ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తుంది. బహుశః ఒకటి రెండు రోజులలో ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. 

బీసీ రిజర్వేషన్స్‌కి లైన్ క్లియర్ అయ్యింది కనుక కాంగ్రెస్‌ పార్టీ ఇదే విషయం గట్టిగా చెప్పుకొని బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించబోతోంది. పనిలో పనిగా బీసీ రిజర్వేషన్స్‌ అంశంపై బీజేపి, బీఆర్ఎస్‌ పార్టీలు ఏవిదంగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయో ప్రజలకు వివరించి వాటి ద్వంద వైఖరిని కామారెడ్డి సభలో ఎండగట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. 

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈ పరిణామం కాంగ్రెస్‌ పార్టీకి చాలా కలిసి రావచ్చు. కనుక కామారెడ్డి సభని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ మంత్రులు, ముఖ్య నేతలు, జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. 


Related Post