ఆ హంతకులిద్దరూ ఝార్ఖండ్‌లో అరెస్ట్‌

September 13, 2025
img

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రేణు అగర్వాల్ హత్య కేసులో ఇద్దరు హంతకులని హైదరాబాద్‌ పోలీసులు ఝార్ఖండ్ రాష్ట్రంలో అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌ తీసుకువస్తున్నారు. 

ఝార్ఖండ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌ వచ్చి స్థిరపడిన రాకేశ్ అగర్వాల్, రేణూ అగర్వాల్ దంపతులు నగరంలోని స్వాన్ లేక్ గేటడ్ కమ్యూనిటీలో నివాసంలో ఉంటున్నారు. తమ రాష్ట్రానికి చెందినవారైతే నమ్మకంగా పనిచేస్తారనే ఉద్దేశ్యంతో వారు ఝార్ఖండ్ నుంచి రోషన్ అనే యువకుడిని తెచ్చి ఇంట్లో పనులకు పెట్టుకున్నారు. 

అతను గత తొమ్మిదేళ్ళుగా వారి ఇంట్లో పనిచేస్తున్నాడు. వారి ఇంట్లో ఒక వంటమనిషి అవసరం ఉండటంతో ఝార్ఖండ్‌లో రోషన్ గ్రామానికే చెందిన హర్ష్ అనే యువకుడిని కూడా తెచ్చుకొని పనిలో పెట్టుకున్నారు. 

రాకేశ్ అగర్వాల్ ప్రతీరోజూ ఉదయం నగరంలోని తన స్టీల్ సామాను దుకాణానికి వెళ్ళిపోతుంటారు. మూడు రోజుల క్రితం రోజూలాగే ఆయన దుకాణానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో రేణూ అగర్వాల్, ఇద్దరు పనివాళ్ళు మాత్రమే ఉన్నారు. 

తాము పనిచేస్తున్న యజమాని ఇంట్లో చాలా డబ్బు, బంగారం, విలువైన వస్తువులున్నట్లు హర్ష్, రోషన్‌లకు తెలుసు. కనుక ఆరోజు వాటన్నిటినీ దోచుకు పారిపోపోవాలని ముందే ప్లాన్ చేసుకున్నారు. రాకేశ్ అగర్వాల్ బయటకు వెళ్ళగానే ఇంట్లో ఒంటరిగా ఉన్న రేణూ అగర్వాల్‌ని తాడుతో కట్టేసి చాకుతో ఆమె శరీరంపై గాయాలు చేస్తూ, బీరువా, లాకర్  తాళాలు తీసుకుని డబ్బు, బంగారం దోచుకున్నారు. 

ఆ తర్వాతా ప్రెషర్ కుక్కర్‌తో ఆమె తలపై గట్టిగా మోది, కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్య చేశారు. తర్వాత ఇద్దరూ ఇంట్లోనే స్నానం చేసి బట్టలు మార్చుకొని సూట్ కేసులో దోచుకున్న సొమ్ము, బంగారం సర్దుకొని రాకేశ్ అగర్వాల్ స్కూటీపైనే పారిపోయారు. 

మధ్యాహ్నం భోజన సమయంలో రాకేశ్ అగర్వాల్ ఇంటికి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా భార్య, పనివాళ్ళు బదులివ్వకపోవడంతో వెంటనే ఇంటికి వచ్చి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న భార్యని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

పోలీసులు కేసు నమోదు చేసుకొని రాకేశ్ అగార్వాల్ ఇచ్చిన వారి వివరాలు, సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన వారి ఫోటోల ఆధారంగా ఝార్ఖండ్‌లో వారిద్దరినీ అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌ తీసుకువస్తున్నారు. 

Related Post