సంగారెడ్డిలో స్కూల్ బస్సు దగ్ధం

July 10, 2025


img

సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదంలో నుంచి ఐదుగురు విద్యార్ధులు తృటిలో తప్పించుకున్నారు. జిల్లాలో కిష్టారెడ్డి పేట సమీపంలో ఓ ప్రైవేట్ స్కూలు బస్సు విద్యార్ధులను స్కూలుకి తీసుకు వెళుతుండగా హటాత్తుగా బస్సులో నుంచి పొగలు రావడం మొదలైంది.

వెంటనే విద్యార్ధులు కేకలు వేయడంతో డ్రైవర్‌ బస్సుని నిలిపివేశాడు. బస్సులో ఉన్న ఐదుగురు విద్యార్ధులు దిగిపోయిన కొన్ని నిమిషాలలోనే  మంటలు వ్యాపించి వారి కళ్ళెదుటే బస్సు దగ్ధమైపోయింది. అది చూసి విద్యార్ధులు చాలా భయపడిపోయారు. 

స్థానికులు వారికి ధైర్యం చెప్పి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక వాహనం అక్కడకు చేరుకునేసరికే బస్సు సగం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. సమాచారం అందుకున్న విద్యార్ధుల తల్లితండ్రులు, స్కూలు యాజమాన్యం అక్కడకు చేరుకుని పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. 

రెండు మూడు వారాల క్రితమే హైదరాబాద్‌ సిపి సీవీ ఆనంద్ ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు, అధ్యాపకులు, సిబ్బంది, బస్సు డ్రైవర్లతో స్కూలు బస్సులు–పిల్లల భద్రత గురించి గట్టిగా హెచ్చరించారు. ఇకపై ప్రమాదాలు జరిగితే స్కూలు యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Related Post