ప్రముఖ నటి నయనతార భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి శనివారం పళని మురుగన్ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆలయ ఆవరణలో స్రాష్టాంగ నమస్కారాలు చేసి తిరిగి వెళ్ళిపోయారు. సెల్ఫీల కోసం భక్తుల అభ్యర్ధనని వారు సున్నితంగా తిరస్కరించారు.
కానీ తమ ఫోటోలు తీసుకుంటునప్పుడు అభ్యంతరం చెప్పకపోవడంతో భక్తులు పోటీపడి తమ మొబైల్ ఫోన్లలో వారి ఫోటోలు, వీడియోలు తీసి బంధు మిత్రులతో పంచుకున్నారు. కొందరు వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి.
చెన్నై-తిరుపతికి మద్య తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో పళనిస్వామి ఆలయం ఉంది. సినీ రాజకీయ ప్రముఖులు తరచూ స్వామివారిని దర్శించుకుంటారు.
పళని స్వామిగా పిలువబడే మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే సుమారు 3,000 ఏళ్ళ క్రితం దీనిని భోగర్ అనే సిద్ధుడు తొమ్మిది రకాల రసాయనాల మిశ్రమంతో తయారుచేసినట్లు చెపుతారు. మరో ప్రత్యేకత ఏమిటంటే స్వామివారు బాలుడి రూపంలో కేవలం కౌపీనం (గోచి) మాత్రమే ధరించి తన దండం పట్టుకొని నిలబడి ఉంటారు.
రసాయనాలతో రూపొందించబడిన స్వామివారి విగ్రహాన్ని అభిషేకించిన జలాలతో తయారుచేసిన పంచామృతాలకు ఔషదగుణాలు ఉంటాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా చర్మవ్యాధులతో బాధ పడుతున్నవారు, మానసిక రోగులు ఈ పంచామృతాలను సేవిస్తే ఉపశమనం లభిస్తుందని భక్తుల నమ్మకం. కనుక నిత్యం వేలాదిమంది భక్తులు పళని స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు.