బనకచర్ల ప్రాజెక్టుతో సహా వివిద అంశాలపై తాను ఎప్పుడైనా, ఎవరితోనైనా చర్చకు సిద్దమని దమ్ముంటే రావాలని సిఎం రేవంత్ రెడ్డి చేసిన సవాలుని తాను స్వీకరిస్తున్నట్లు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అవసరం లేదు. నేను చాలు.
మంగళవారం ఉదయం 11గంటలకు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కి వస్తాను. నువ్వు కూడా నీ ఎమ్మెల్యేలని వెంటపెట్టుకొని రా. అక్కడ మీడియా సమక్షంలోనే ఇద్దరం బనకచర్ల ప్రాజెక్టుతో సహా అన్నిటిపై చర్చిద్దాం,” అని కేటీఆర్ సిఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు.
వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 100 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుందనే సిఎం రేవంత్ రెడ్డి చెప్పడాన్ని కేటీఆర్ ఎద్దేవా చేస్తూ “వందా బొందా?ఎన్నికల హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలా? కాంగ్రెస్ పాలన ఎంత దరిద్రంగా ఉంటుందో మళ్ళీ ప్రజలకు రుచి చూపిస్తూ, మళ్ళీ మీ పార్టీని గెలిపించాలాని ఎలా ఆడగగలుగుతున్నారు?
అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరపైన అయ్యింది. ఇంత వరకు రాష్ట్రంలో కొత్తగా ఓ అభివృద్ధి పని మొదలుపెట్టారా? కొత్తగా ఓ సంక్షేమ పధకాన్ని ప్రారంభించారా? మా ప్రభుత్వ హయంలో పూర్తయిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అర్హత సాధించినవారికి అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చి అవి మీ ప్రభుత్వం భర్తీ చేసిందని నిసిగ్గుగా చెప్పుకుంటున్నారు,” అంటూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, సిఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.