డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికయ్యేందుకు ఎలన్ మస్క్ ఎంతగానో సాయపడ్డారు. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత కొన్ని నెలలు ఇద్దరి మద్య బంధం బాగానే ఉండేది. కానీ ఇటీవల వివిద అంశాలలో వారి మద్య విభేదాలు పెరగడంతో దూరం కూడా పెరిగింది.
ట్రంప్ చాలా ప్రతిష్టాత్మకంగా భావించిన ‘ది బిగ్, బ్యూటీఫుల్ బిల్’ని ఎలన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానిని అమలుచేస్తే తాను కొత్త రాజకీయ పార్టీ పెడతానని ఎలన్ మస్క్ ముందే చెప్పారు. ఇటీవల ట్రంప్ ఆ బిల్లుపై సంతకం చేయడంతో ఎలన్ మస్క్ చెప్పినట్లుగానే కొత్త రాజకీయ పార్టీ ‘అమెరికా పార్టీ’ని ప్రకటించారు.
ఎలన్ మస్క్ అధినేతగా ఉన్న ఎక్స్ సోషల్ మీడియాలో కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయం సేకరించగా సానుకూల స్పందన వచ్చింది. కనుక ‘అమెరికా పార్టీ’ స్థాపిస్తున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. అమెరికాలో ఒక్క పార్టీ వ్యవస్థని సవాలు చేస్తూ దేశ ప్రజలకు స్వాతంత్ర్యం తిరిగి ఇచ్చేందుకు ‘అమెరికా పార్టీ’ని స్థాపిస్తున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు.
అమెరికాలో అనేక రాజకీయ పార్టీలున్నప్పటికీ దశాబ్ధాలుగా డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీల మధ్యే అధికార మార్పిడి జరుగుతోంది.
అపర కుబేరుడు, ట్రంప్‌ను ధీటుగా ఎదుర్కోగల ధైర్యం ఉన్న ఎలన్ మస్క్ ఇప్పుడు ఈ కొత్త పార్టీతో అమెరికా ప్రజలకు ఆ రెండు పార్టీలకు మరో ప్రత్యామ్నాయం చూపిస్తున్నారు.
కానీ ఎలన్ మస్క్ కూడా ట్రంప్‌లాగే వ్యాపారవేత్త. దేనినైనా వ్యాపార కోణంలో నుంచే చూస్తుంటారు. కనుక ఆయన స్థాపించిన ‘అమెరికా పార్టీ’ డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీలకు భిన్నంగా ఉంటుందా?కాలమే సమాధానం చెపుతుంది. ఏది ఏమైనప్పటికీ అమెరికా రాజకీయాలలో ఇదో సంచలనమే!