హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల్లో విజేతగా నిలిచి కిరీటం గెలుచుకున్న ఓపెల్ సుచాత చూవాంగ్ నేడు విదేశీ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగివచ్చినప్పుడు ఆమెకు థాయ్‌లాండ్ ప్రభుత్వం, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.
రెండు తెల్లటి ఏనుగు బొమ్మలతో అందంగా అలంకరించిన వాహనంపై ఆమెను ఊరేగిస్తూ తీసుకువెళ్ళారు. దారి పొడవునా వేలాది మంది ప్రజలు తనకి జేజేలు పలుకుతూ ఘన స్వాగతం పలుకుతుంటే మిస్ వరల్డ్ 2025 ఓపెల్ సుచాత చాలా భావోద్వేగానికి గురయ్యారు. కానీ తెరుకొని సంతోషంగా అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
మిస్ వరల్డ్ 2025 ఓపల్ సుచాత జీవిత విశేషాలు: ఆమె డిగ్రీ (అంతర్జాతీయ సంబంధాలు) విద్యార్ధిని. 16 ఏళ్ళ వయసులోనే రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డారు. కానీ దాంతో జీవితం ముగిసిపోయిందనుకోకుండా ధైర్యంగా పోరాడి క్యాన్సర్ మహమ్మారిని జయించి మళ్ళీ 18 ఏళ్ళ వయసు నుంచే అందాల పోటీలలో పాల్గొంటూ ఈ స్థాయికి చేరుకున్నారు.
అప్పటి నుంచే ఆమె తన పేరిట ‘ఓపల్ ఫర్ హర్' అనే ఓ స్వచ్ఛంద సంస్థని ప్రారంభించి తన దేశంలో క్యాన్సర్ వ్యాధి బారిన పడిన మహిళలకు అండగా నిలబడ్డారు.
మిస్ వరల్డ్ 2025 ఓపల్ సుచాత జంతు ప్రేమికురాలు. తన ఇంట్లో 18 పిల్లులు, 5 కుక్కలు ఉన్నాయని వాటన్నితినీ కుటుంబ సభ్యులుగానే పరిగణించి ప్రేమిస్తానని చెప్పారు.
ఒకవేళ ఈ మోడల్ రంగంలో ప్రవేశించకపోతే రాజకీయాలలో ప్రవేశించి అంతర్జాతీయ సంబంధాల విభాగంలో పనిచేయాలనుకున్నానని ఓపల్ సుచాత చెప్పారు. థాయ్‌లాండ్ ప్రభుత్వం అనుమతిస్తే తన దేశం తరపున రాయబారిగా పనిచేయాలని ఆశపడుతున్నానని చెప్పారు.
ఈ మిస్ వరల్డ్ కిరీటం తనపై మరింత బాధ్యత పెట్టిందని, ఇకపై థాయ్‌లాండ్‌తో సహా ప్రపంచ దేశాలలో రొమ్ము క్యాన్సర్ వ్యాధి గురించి మహిళలను చైతన్యపరుస్తూ వారికి అవసరమైన సహకారాలు, వైద్య చికిత్సలు అందేలా కృషి చేస్తానని చెప్పారు.
మిస్ వరల్డ్ 2025 పోటీలలో మొదటి రన్నరప్‌గా మిస్ ఇథియోపియా హాసేట డెరేజె, రెండో రన్నరప్‌గా మిస్ పోలాండ్ మయా క్లయిడా, మూడో రన్నరప్‌గా మిస్ మార్టినిక్ ఆరేలి జొచిం నిలిచారు.
థాయిలాండ్ లో మిస్ వరల్డ్ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ కి గ్రాండ్ వెల్కమ్ #Opalsuchata #Thailand #RTV pic.twitter.com/eGnOOEExrl