ఈ అతిధి మర్యాదలు మరీ అతిగా లేవూ?

May 15, 2025


img

అతిధులను గౌరవించడం భారతీయ సాంప్రదాయం కనుక మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలలో పాల్గొనేందుకు 110 దేశాల నుంచి వచ్చిన అందాల భామలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ ఘనంగా అతిధి మర్యాదలు చేస్తోంది. వారిని రెండు బృందాలుగా విభజించి రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు తిప్పి చూపిస్తోంది.

బుధవారం 57 మంది సుందరీమణులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. వారిలో 22 మంది వరంగల్ కోటని సందర్శించగా, మిగిలినవారు ములుగు జిల్లా రామప్ప ఆలయాన్ని సందర్శించారు. వారందరూ తెలుగుదనం ఉట్టిపడేలా చీరలు, లంగా ఓణీలు, నెత్తిన పూలు పెట్టుకొని వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారికి తెలంగాణ మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. వారు కూడా తెలంగాణ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. 

      

ఆలయంలో ప్రవేశించే ముందు వారందరూ వరుసగా కుర్చీలలో కూర్చొని పళ్ళాలలో నీళ్ళతో పాదాలు కడుక్కొని టవల్స్‌తో తుడుచుకున్నారు. ఈ సందర్భంగా కొందరు సుందరీమణులు పాదాలు కడుక్కోవడానికి ఇబ్బంది పడుతుండటంతో తెలంగాణ మహిళలు వారికి సాయపడ్డారు. ఆ ఫోటోలు, వీడియో వైరల్ అయ్యింది. మన రాష్ట్రానికి వచ్చిన విదేశీయులను గౌరవించడం, అతిధి మర్యాదలు చేసి పంపడం అభినందనీయమే కానీ తెలంగాణ మహిళల చేత విదేశీయుల కాళ్ళు కడిగించి అవమానిస్తారా? అంటూ పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

రామప్ప ఆలయ సందర్శన తర్వాత నంది విగ్రహం వద్ద సుందరీమణులు ఫోటో ఘాట్‌లో పాల్గొన్నారు. అనంతరం రామప్ప గార్డెన్‌లో తెలంగాణ నృత్యకారులు, కళాకారులు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిభింబించే నృత్యాలు, కళా ప్రదర్శలతో వారిని అలరించారు. రాత్రి విందు భోజనం తర్వాత హైదరాబాద్‌ చేరుకున్నారు.  


Related Post