జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం శైవ క్షేత్రం వద్ద త్రివేణీ సంఘమంలో గురువారం నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. గోదావరి, ప్రాణహిత నదులలో సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. బుధవారం రాత్రి 10.35 గంటలకు బృహుస్పతి (గురువు) మిధునరాశిలో ప్రవేశించడంతో సరస్వతి పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 26తో ముగుస్తాయి.
గురువారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు త్రివేణీ సంఘమంలో పుష్కర స్నానాలు ఆచరించి కాళేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు.
సరస్వతి పుష్కరాలకు సుమారు లక్షన్నరకు పైగా భక్తులు తరలివస్తారు కనుక తెలంగాణ ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించి కాళేశ్వరం త్రివేణీ సంఘమం వద్ద ఘాట్ల మరమత్తులు చేయించి, భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. వేసవి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నందున భక్తులు సేద తీరేందుకు కాళేశ్వరం సమీపంలో టెంట్స్ ఏర్పాటు చేసింది. టిజిఎస్ ఆర్టీసీ హైదరాబాద్‌తో సహా రాష్ట్రం నలుమూలల నుంచి కాళేశ్వరంకు ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. కనుక భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా టిజిఎస్ ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.