ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్సీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్స్ అమలుచేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ బిల్లుకి ఈ నెల 8న ఆమోదముద్ర వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిని అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది.
అయితే ఎస్సీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్స్ ఏప్రిల్ 14,2025 నాటికి వెలువడిన ఉద్యోగ నోటిఫికేషన్స్‌కు వర్తించదు. అంటే ఇప్పటికే భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న గ్రూప్-1,2,3 ఉద్యోగాలకు ఈ రిజర్వేషన్స్ వర్తించవన్న మాట. కానీ ఇకపై ప్రకటించబోయే గ్రూప్-1,2,3 ఉద్యోగాలకు, ప్రభుత్వ విద్యా సంస్థలలో ప్రవేశాలకు వరుసగా 1, 9,5 శాతం చొప్పున వర్తింపజేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కనుక ఎస్సీలలో ఉప కులాలకు ఈ మేరకు లబ్ధి కలుగబోతోంది.
విద్యా, ఉద్యోగాలలో మహిళలకు ఎప్పటిలాగే 33 శాతం రిజర్వేషన్స్ అమలు చేస్తారు. ఒకవేళ ఆయా ఉప కులాలలో ఉద్యోగాలకు అర్హులైనవారు లేకపోతే తదుపరి గ్రూపు అభ్యర్ధితో భర్తీ చేస్తారు. ఎస్సీలలో అర్హులైన మహిళ అభ్యర్ధులు లేనట్లయితే ఆ ఉద్యోగాలను తదుపరి నోటిఫికేషన్‌లో వర్తింపజేస్తారు.