కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సినిమాలలో కూడా చేస్తున్నారు కనుక ఆమె పేరు అందరికీ సుపరిచితమే. కానీ మీడియాకు దూరంగా ఉండే ఆమె భర్త ఎంవి శ్రీనివాస్ ప్రసాద్ తొలిసారిగా వార్తల్లోకి వచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చంద్ర కిరణ్ రెడ్డి అనే వ్యక్తిపై ఆయన పిర్యాదు చేశారు. గతంలో విజయశాంతి బీజేపిలో ఉన్నప్పుడు ఆమె తరపున సోషల్ మీడియా అకౌంట్ నిర్వహించేందుకు అతనిని నియమించుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలోకి మారిన తర్వాత ఇక ఆయన అవసరం లేదని చెప్పి పంపించేశారు. అతనే విజయశాంతిని బెదిరిస్తూ ఆమె మొబైల్ ఫోన్‌కు సందేశాలు పంపిస్తున్నాడు. తన బాకీ పూర్తిగా చెల్లించాలని లేకుంటే చంపేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ ప్రసాద్ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అయితే అతనికి విజయశాంతి దంపతులు డబ్బు బాకీ ఉన్నారా? అది చెల్లించకపోవడం వలన లేదా తనని ఉద్యోగంలో నుంచి తొలగించడం వలన అతను ఆవేశంతో ఈవిధంగా మెసేజులు పెట్టాడా లేక విజయశాంతి దంపతులను బెదిరించి సులువుగా డబ్బు సంపాదించుకోవచ్చని అనుకున్నాడా? అనే విషయాలు పోలీసుల విచారణలో తెలుస్తాయి.