ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత 70 స్థానాలకు బీజేపి 48 గెలుచుకోగా, ఆమాద్మీ పార్టీ 22 గెలుచుకుంది. బీజేపి ఘన విజయం సాధించడంతో తెలంగాణ బీజేపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“అరవింద్ కేజ్రీవాల్ చీపురుకట్టతో అవినీతిని తుడిచి బయటపడేస్తా అంటూ అధికారంలోకి వచ్చారు. కానీ పదేళ్ళు గడిచేసరికి ఆయనే అవినీతిలో కూరుకుపోయి ఆ కారణంగానే అధికారం కోల్పోయారు.
మద్యం కుంభకోణం కేసులో తాను తప్పు చేయలేదని నమ్మితేనే తనకు ఓట్లు వేసి గెలిపించాలని అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను కోరారు. ఆయన అవినీతికి పాల్పడ్డారని ప్రజలు నమ్మారు కనుకనే ఆయనని ఓడించారు. కనుక మద్యం కుంభకోణంలో ప్రజలు తీర్పు ఇచ్చేశారు. ఇక న్యాయస్థానం తీర్పు ఈయవలసి ఉంది.
పాలకులు అవినీతికి పాల్పడుతూ ప్రజలను సంక్షేమ పధకాల ఎర వేసి మభ్యపెట్టాలని ప్రయత్నిస్తే ఏమవుతుందో ఢిల్లీ ఓటర్లు నిరూపించి చూపారు.
ఇక కాంగ్రెస్ పార్టీకి ఇది ఎన్నో ఓటమో లెక్కపెట్టుకోవడం కూడా కష్టమే. ఢిల్లీలో వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. రాహుల్ గాంధీకి తన పార్టీని గెలిపించుకోవాలనే ఆలోచన చేయకుండా ఎంతసేపు ప్రధాని మోడీ విమర్శించడంపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మరోసారి ఈ ఎన్నికలలో డకవుట్ అయ్యింది.
కనీసం ఇప్పటికైనా రాహుల్ గాంధీ భవన్‌లో, కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనా ధోరణి మార్చుకొని కాంగ్రెస్ పార్టీపై దృష్టిపెట్టి పనిచేసుకుంటే వారికే మంచిది,” అని కిషన్ రెడ్డి అన్నారు.