పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేరుని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. తక్షణం ఈ నియామకం అమలులోకి వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఇంతకాలం పిసిసి అధ్యక్షుడుగా పార్టీని విజయపదంలో నడిపించి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన సిఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేశారు.
ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కనుక పిసిసి అధ్యక్షుడు రేసులో కొంత మంది సీనియర్లు పోటీ పడినప్పటికీ మహేష్ కుమార్ గౌడ్‌కే ఈ పదవి దక్కింది.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరడంతో ప్రభుత్వానికి ఇక ఢోకా లేదు. దగ్గర్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. కనుక మహేష్ కుమార్ గౌడ్‌కి అవే తొలి పరీక్షగా భావించవచ్చు. కానీ వాటికి ఇంకా సమయం ఉంది కనుక ఆలోగా పార్టీపై పట్టు సాధించగలిగితే సరిపోతుంది.