కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు కేటాయించకపోవడంపై సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు జూబ్లీహిల్స్‌లో తన నివాసంలో తన మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
“మోడీ ప్రభుత్వం టిడిపి, జేడీయూ మద్దతుతో మనుగడ సాగిస్తోంది కనుక ఆ రెండు రాష్ట్రాలకే బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చి నిధులు కేటాయించింది. మోడీ తన కుర్చీని కాపాడుకోవడానికే ఇలా చేశారు కనుక ఇది ఖచ్చితంగా క్విడ్ ప్రో బడ్జెట్.
ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు, మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని కలిసినప్పుడు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశాను. మోడీ పెద్దన్న వంటివారని ఆయన సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా గుజరాత్‌లాగ అభివృద్ధి చేసేందుకు సహకరించాలని పదేపదే కోరాను. కానీ మోడీ తెలంగాణ రాష్ట్రానికి హ్యాండ్ ఇచ్చారు.
అసలు ‘తెలంగాణ’ అనే పదంపై నిషేదం ఉన్నట్లు బడ్జెట్‌లో ఎక్కడ తెలంగాణ ప్రస్తావనలేదు. ‘సబ్ కే సాత్... సబ్ కా వికాస్’, ‘వికసిత్ భారత్’ అంటూ గొప్పలు చెప్పుకొని తెలంగాణ రాష్ట్రానికి ఈవిదంగా మొండి చెయ్యి చూపడం సిగ్గుచేటు.
బీజేపీకి తెలంగాణలో ఓట్లు, సీట్లు, అధికారం కావాలి తప్ప రాష్ట్రాభివృద్ధిపట్ల ఆసక్తి లేదని నేను ఇదివరకే చెప్పాను. ఇప్పుడు అదే నిజమైంది. తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. కానీ ఆయన తన రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోయారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ళవద్ద పెట్టేసి పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణకు జరిగిన వివక్షను నిరసిస్తూ ఇకనైనా తన పదవికి రాజీనామా చేసి మాతో కలిసి పార్లమెంటులో పోరాటానికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
దక్షిణాది రాష్ట్రాల ప్రజలను బీజేపీ ఓటింగ్ యంత్రాలుగానే చూస్తోంది. ఇది సరికాదని, ఈ వివక్ష ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమం మొదలయ్యే ప్రమాదం ఉంది. ఈ అంశంపై తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులతో మాట్లాడుతాను. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కూడా మాతో కలిస్తే బాగుంటుంది.
కేంద్ర బడ్జెట్‌పై నేడు శాసనసభలో చర్చించి రాష్ట్రానికి ఏవిదంగా అన్యాయం జరిగిందో వివరిస్తాము. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ-బిఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందాలను కూడా బయటపెడతాము,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.