కాంగ్రెస్ ఎన్నికల హామీలను సిఎం రేవంత్ రెడ్డి ఒకటొకటిగా నెరవేర్చుతున్నారు. వాటిలో ఒకటైన రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ హామీని నేటి నుంచి అమలు చేయబోతున్నారు. ముందుగా లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాలలో ప్రభుత్వం ఆ సొమ్ముని జమా చేయబోతోంది.
తొలివిడతలో 1.75 లక్షల మంది రైతుల పంట రుణాలు మాఫీ చేయబోతోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7,000 కోట్లు విడుదల చేసింది.
ఆ తర్వాత ఈ నెలాఖరులోగా లక్షన్నర రుణాలకు, ఆగస్ట్ మొదటి వారంలోగా రెండు లక్షల వరకు రుణాలకు సొమ్ముని రైతుల ఖాతాలలో జమా చేయబోతోంది. ఈ పధకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.31,000 కోట్లు కేటాయించిన్నట్లు సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
పంట రుణాల మాఫీ హామీపై తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నిరూపించుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీకి కట్టుబడి పంట రుణాలను మాఫీ చేస్తున్నామని చెప్పారు.
లక్ష రూపాయల పంట రుణాల మాఫీకి కేసీఆర్‌కు పదేళ్ళు పట్టిందని అది కూడా రూ.25000 చొప్పున చెల్లించడంతో అది రైతులకు ఉపయోగపడలేదని అన్నారు. కేసీఆర్ పదేళ్ళలో లక్ష రూపాయల పంట రుణాల మాఫీకి రూ.28,000 కోట్లు ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే రూ.31,000 ఖర్చు చేస్తోందని చెప్పారు. అయినా బిఆర్ఎస్ నేతలు సిగ్గులేకుండా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పంట రుణాల మాఫీ చేసిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు అందరూ రైతులతో కలిసి పండుగ చేసుకోవాలని, బిఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. తాను కూడా రైతులను కలిసి మాట్లాడి దీనిపై వారి అభిప్రాయాలు తెలుసుకుంటానని చెప్పారు.