కూతురు కోసం కేసీఆర్‌ 5 ఎంపీ సీట్లు బీజేపీకి తాకట్టు: రేవంత్‌

April 16, 2024


img

సిఎం రేవంత్‌ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారసభలో ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చిక్కుకొని తీహార్ జైల్లో ఉన్న కూతురు కల్వకుంట్ల కవితని విడిపించుకునేందుకు కేసీఆర్‌, ప్రధాని నరేంద్రమోడీతో రహస్య అవగాహన కుదుర్చుకున్నారు.

చేవెళ్ళ, మల్కాజ్‌గిరి, భువనగిరి, జహీరాబాద్, మహబూబ్ నగర్‌ 5 నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ని ఓడించి బీజేపీని గెలిపించడమే ఆ ఒప్పందం. అందుకే బిఆర్ఎస్ పార్టీ ఈ 5 నియోజకవర్గాలలో పెద్దగా ఎన్నికల ప్రచారం చేయడం లేదు.

కూతురు కోసం కేసీఆర్‌ బిఆర్ఎస్ పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టేస్తున్నారు. కూతురు కోసం బిఆర్ఎస్ పార్టీ నేతల, కార్యకర్తల, ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర  పెట్టేశారు. శాసనసభ ఎన్నికలలో గద్వాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు పరస్పరం సహకరించుకున్నాయి. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో కూడా అదే చేస్తున్నాయి.

అయితే బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ఈసారి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 10-14 సీట్లు గెలుచుకోవడం ఖాయమే. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు ఇచ్చి గెలిపిస్తే ముదిరాజ్‌ బిడ్డకి మంత్రి పదవి ఇస్తాను,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. 

ఎన్నికల కోడ్ కారణంగా రైతుల రుణమాఫీ చేయలేకపోయామని, ఆగస్ట్ 15లోగా 68 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అలాగే కాంగ్రెస్‌ హామీ ప్రకారం వచ్చే పంట నుంచి రూ.500 బోనస్ కూడా ఇస్తామని ప్రకటించారు. రైతులు పండించే ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, కనుక బిఆర్ఎస్ నేతల దుష్ప్రచారాన్ని నమ్మవద్దని సిఎం రేవంత్‌ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.


Related Post