మరో రెండు వారాలు జైల్లోనే కవిత

April 16, 2024


img

లిక్కర్ స్కామ్‌ కేసులో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 15న అరెస్టు కాగా అప్పటి నుంచి ఢిల్లీ  తిహార్ జైల్లోనే  ఉన్నారు. బెయిల్‌ కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. మూడు రోజుల సీబీఐ కస్టడీలో ఉన్న ఆమెను సోమవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. సుదీర్గ విచారణ తర్వాత ఆమెకు మళ్ళీ ఏప్రిల్‌ 23 వరకు రెండు వారాలు జ్యూడిషియల్ రిమాండ్‌ విధిస్తున్నట్లు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు చెప్పారు. 

కనుక మళ్ళీ ఆమె తరపు న్యాయవాది కోర్టులో మళ్ళీ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈసారి ఆమె ఆరోగ్య కారణాలతో బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్‌ 22కి వాయిదా వేశారు. అంటే ఆమె రెండు వారాలు జైల్లోనే గడపాక తప్పదన్న మాట! 

సోమవారం ఈ కేసు విచారణకు కల్వకుంట్ల కవితని తీసుకువస్తున్నప్పుడు ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడటాన్ని న్యాయమూర్తి కావేరీ బవేజా తప్పు పట్టారు. కేసు విచారణ జరుగుతున్నప్పుడు జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నవారు కేసు గురించి మీడియాతో మాట్లాడటం సరికాదని ఆమె న్యాయవాది మోహిత్ రావుని మందలించారు. 

కల్వకుంట్ల కవిత కోర్టు హాలులోకి ప్రవేశిస్తున్నప్పుడు, “ఈ కేసులో కొత్తగా ఏమీ లేదు. రెండు సంవత్సరాల నుంచి అడిగిన ప్రశ్నలనే సీబీఐ వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. బయట బీజేపీ వాళ్ళు ఏం చెపుతున్నారో లోపల సీబీఐ వాళ్ళు అదే అడుగుతున్నారు. ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ!” అని అన్నారు. 


Related Post