ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఇక బిఆర్ఎస్ నేతలకు నోటీసులు?

April 12, 2024


img

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్‌ కేసులో గురువారం కీలక పరిణామం జరిగింది. ఇప్పటి వరకు ఈ కేసులో పోలీస్ అధికారులను మాత్రమే ప్రశ్నిస్తుండటం ప్రభుత్వంపై పెద్దగా రాజకీయ ఒత్తిళ్ళు ఏర్పడలేదు. కానీ ఈ కేసు విచారణలో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని తెలుస్తూనే ఉంది కనుక రాబోయే రోజుల్లో వారికీ నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. 

అప్పుడు ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిళ్ళు మొదలైతే ఈ కేసు విచారణకు చాలా అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక ఈ కేసులో ఎదురయ్యే అటువంటి న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొని అధిగమించి ముందుకు సాగేందుకు ప్రత్యేకంగా ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవసరమని సిట్ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం కేవలం ఈ కేసుల విచారణ కోసమే సాంబశివా రెడ్డిని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ నియమిస్తూ గురువారమే ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ అధికారులు తరపున పంజగుట్ట పోలీసులు వెంటనే నాంపల్లి కోర్టులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ నియామకం గురించి తెలియజేస్తూ మెమో దాఖలు చేశారు. కోర్టు దీనిని పరిశీలించి ఆమోదముద్ర వేయడం లాంఛనప్రాయమే. కనుక సోమవారం నుంచి ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 

ఈ ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం అంతా గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్న సంగతి తెలిసిందే. కనుక ఈ కేసులో మాజీ సిఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌తో సహా పలువురికి రాబోయే రోజుల్లో నోటీసులు పంపే అవకాశం ఉంది. 


Related Post