నేడు మహబూబ్ నగర్‌లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

March 28, 2024


img

నేడు మహబూబ్ నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగనుంది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. 

కాంగ్రెస్‌ అభ్యర్ధిగా మన్నే జీవన్ రెడ్డి, బిఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్ధిగా సుదర్శన్ గౌడ్ పోటీ చేస్తున్నారు. 

ఈరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. దీని కోసం జిల్లాలో 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎక్స్‌ అఫీషియోలు, పురపాలక సంఘాలలో కౌన్సిలర్లు కలిపి మొత్తం 1,439 మంది ఓటర్లున్నారు. 

కాంగ్రెస్‌, బిఆర్ఎస్ రెండు పార్టీలు ఈ సీటు దక్కించుకోవాలని చాలా పట్టుదలగా ఉన్నందున, తమ పార్టీలకు చెందిన స్థానిక సంస్థల సభ్యులు ప్రత్యర్ధి పార్టీ వైపు వెళ్ళిపోకుండా కాపాడుకునేందుకు అందరినీ గోవా, బెంగళూరు తరలించి క్యాంప్ రాజకీయాలు చేస్తున్నాయి. వారందరూ ఈరోజు ఉదయం నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకొంటారు. 

పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలట్ బాక్సులను స్థానిక బాలుర జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములో భద్రపరిచి ఏప్రిల్‌ 2న కౌంటింగ్ చేసి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.


Related Post