హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో నగదు తరలింపు...

March 24, 2024


img

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13న జరుగుతాయి. అంటే ఎన్నికలకు ఇంకా సుమారు రెండు నెలల సమయం ఉందన్న మాట. కానీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు నగదు, బహుమతులు, మద్యం బాటిల్స్ నియోజకవర్గాలకు గుట్టుగా తరలించడం ప్రారంభించాయి. 

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచే పోలీసులు వాహనాల తనికీలు ప్రారంభించారు. కనుక కార్లలో తరలిస్తే వారికి పట్టుబడతామనే ఉద్దేశ్యంతో వనపర్తి నుంచి వస్తున్న జయదేవ్ అనే వ్యక్తి ఆర్టీసీ బస్సులో ఏకంగా రూ.16.50 లక్షల నగదు, భారీగా వెండి సామాను తరలించే ప్రయత్నం చేశాడు. 

ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లాలో రాయికల్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలు తనికీలు చేస్తూ ఆర్టీసీ బస్సుని కూడా తనికీ చేయగా నగదు, వెండి సామాను పట్టుబడింది. పోలీసులు నగదుని, వెండి సామాను స్వాధీనం చేసుకొని అతనిని అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆ సొమ్ము, వెండి సామాను ఏదైనా రాజకీయ నాయకుడికి చెందినవా లేక ఏదైనా నగల దుకాణంకు చెందినవా?అనేది ఇంకా తెలియవలసి ఉంది. 

ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో ప్రణీత్ రావుని అరెస్ట్ చేసి ప్రశ్నించగా అదనపు ఎస్పీ భుజంగరావు, మరో ఎస్పీ తిరుపతన్న ఎన్నికల సమయంలో తమ పోలీస్ వాహనాలలో నగదుని తరలించిన్నట్లు కనుకొని వారిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.


Related Post