ధారావిలో కరోనా కట్టడి అద్భుతం: ప్రపంచ ఆరోగ్యసంస్థ

July 11, 2020


img

దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 2,38,461 పాజిటివ్ కేసులు, ఆ రాష్ట్ర రాజధాని ముంబైలో 90,461 కేసులు నమోదు కాగా, నేటివరకు మొత్తం 9,893 మంది కరోనాతో మరణించారు. వాస్తవానికి జాతీయస్థాయి కరోనా కేసులలో మహారాష్ట్రవే ఎక్కువశాతం ఉన్నాయి. అయితే ఆసియాలోకెల్లా అతిపెద్ద మురికివాడ ముంబైలోని ధారావిలో కరోనా పూర్తిగా నియంత్రణలో ఉండటం విశేషం. సుమారు 6-10 లక్షలమందికిపైగా నిరుపేదలు ఉండే ధారవీ మురికివాడలో కరోనా ప్రవేశిస్తే మహావిస్పోటనం జరుగుతుందని అందరూ భయపడ్డారు. కానీ బృహున్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది చాలా పట్టుదలతో నిర్విరామంగా చేసిన కృషి కారణంగా, ధారావీలో అందరూ భయపడినట్లు ఏదో ఉత్పాతం జరగలేదు. ధారావీలో నేటివరకు కేవలం 2,335 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవడం గమనిస్తే అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు కరోనాను కట్టడిచేయడానికి ఎంతగా కష్టపడ్డారో అర్ధమవుతుంది. 

గత నాలుగు నెలల్లో మునిసిపల్, ఆరోగ్యశాఖ సిబ్బంది ఆ ఇరుకు గల్లీలలో ఇంటింటికీ వెళ్ళి సుమారు 7 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు! “టెస్ట్-ఐసోలెట్-ట్రీట్” అనే పద్దతిలో ధారావీలో కరోనా వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. “ఛేజ్ ద కరోనా వైరస్’ (కరోనాను తరిమికొడదాం) అనే ఏకైక నినాదంతో అందరూ కలిసికట్టుగా కృషి చేసి కరోనాను పూర్తిగా కట్టడి చేశారు. ప్రస్తుతం ధారావిలో కేవలం 354 పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.   

అంత ఎక్కువ జనాభా ఉన్న ధారావీ మురికివాడలో అత్యంత సమర్ధంగా కరోనాను కట్టడి చేసిన విధానం చూసి ప్రపంచఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్‌రోస్ ఏ. గెబ్రియేసిస్ ప్రశంశలు కురిపించారు. కరోనా కట్టడిలో ధారావీ ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలిచిందని మెచ్చుకొన్నారు. మహారాష్ట్ర... రాజధాని ముంబైలో కూడా కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఇదేవిధంగా గట్టి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు విజ్ఞప్తి చేశారు.



Related Post