విశాఖలో మళ్ళీ గ్యాస్ లీక్...ఇద్దరు మృతి

June 30, 2020


img

విశాఖలో మళ్ళీ గ్యాస్ లీక్ అయ్యింది. విశాఖ శివారులోగల పరవాడ పారిశ్రామికవాడలో గల సాయినార్ లైఫ్ సైన్సస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో సోమవారం అర్ధరాత్రి బెంజీన్ మెడిజోన్ అనే ప్రమాదకరమైన విషవాయువు లీక్ అయ్యింది. దాంతో నైట్ డ్యూటీలో ఉన్న షిఫ్ట్ ఇన్-ఛార్జ్ రావి నరేంద్ర (33), కెమిస్ట్ గౌరీ శంకర్ (26) చనిపోయారు. నైట్ డ్యూటీలో ఉన్న చంద్రశేఖర్, జానకీరావు, ఆనందబాబు, సూర్యనారాయణ అనే మరో నలుగురు ఉద్యోగులు విషవాయువును పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే చాలా తక్కువ మొత్తంలో గ్యాస్ లీక్ అవడం వలన పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలలో పనిచేస్తున్నవారికి కానీ పరిసరప్రాంతాలలో నివశిస్తున్న ప్రజలకు గానీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. చనిపోయినవారిని పోస్టుమార్టం కొరకు విశాఖ నగరంలోని కేజీ హాస్పిటల్‌కు తరలించి, బాధితులను స్థానిక  ఆర్‌.కె. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సమాచారం అందుకొన్న పోలీసులు, అగ్నిమాపక శాఖ అక్కడకు చేరుకొని ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించారు. జిల్లా కలక్టర్‌ వినయ్ చంద్, నగర పోలీస్ కమీషనర్ ఆర్‌కే మీనా ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను సమీక్షించి ప్లాంటులో గ్యాస్ లీక్ నిలిపివేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. హైడ్రోజన్ సల్ఫైడ్ అధిక మొత్తంలో విడుదల కావడం వలన   గ్యాస్ లీక్‌ అయినట్లు ప్రాధమిక సమాచారం.  

గ్యాస్ లీక్‌లో ఇద్దరు ఉద్యోగులు చనిపోవడంతో కంపెనీ వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పరిస్థితులు అదుపు తప్పకుండా భారీగా పోలీసులను మోహరించారు. 

గత నెల 7వ తేదీన విశాఖ నగరంలోనే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది చనిపోగా, సుమారు 300 మంది అస్వస్థులైన సంగతి తెలిసిందే.


Related Post