వారికి సిఎం కేసీఆర్‌ ప్రత్యేక విజ్ఞప్తి

April 07, 2020


img

దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో హటాత్తుగా కరోనా వైరస్ విజృంభించడానికి కారణం డిల్లీ, నిజాముద్దీన్‌ మత సమావేశాలలో పాల్గొన్నవారేనని స్పష్టం అయ్యింది కనుక అన్ని రాష్ట్రాలలో వారి కోసం పోలీసులు, వైద్యా ఆరోగ్య సిబ్బంది గాలిస్తున్నారు. వారిలో కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకొని అవసరమైతే క్వారంటైన్‌లో ఉంటున్నారు. కానీ చాలామంది అవగాహనా రాహిత్యం లేదా భయం చేతనో వైద్యఆరోగ్య సిబ్బందికి, పోలీసులకు చిక్కకుండా రహస్యంగా దాక్కొంటున్నారు. అటువంటివారిని ఉద్దేశ్యించి సిఎం కేసీఆర్‌ నిన్న ఒక విజ్ఞప్తి చేశారు. 

సోమవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “తొలిదశలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో 25,937 మందిని క్వారంటైన్‌లో ఉంచాము. అదృష్టవశాత్తు వారిలో 50 మందికి తప్ప మిగిలినవారందరూ కరోనా లేదని స్పష్టమైంది. ఆ 50 మందిని కూడా కరోనా తొలిదశలో ఉన్నప్పుడే గుర్తించి సకాలంలో వైద్య చికిత్స అందించాము కనుక అందరూ కొలుకొంటున్నారు. త్వరలోనే క్వారంటైన్‌లో ఉన్నవారిని, కరోనా సోకి చికిత్సతో కోలుకొన్నవారిని దశలవారీగా విడుదల చేస్తాము,” అని అన్నారు. 

అయితే రెండో దశలో నిజాముద్దీన్‌ మత సమావేశాలలో పాల్గొన్నవారి ద్వారా రాష్ట్రంలో కరోనా శరవేగంగా వ్యాపించింది. జిల్లాల వైద్యఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, పోలీసులు, ఇంటలిజన్స్ అధికారులు అందరి సాయంతో మత సమావేశాలకు హాజరై తిరిగివచ్చిన 1,089 మందిని గుర్తించాము. వారిలో 172 మందికి, వారి ద్వారా మరో 93 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వారి కుటుంబ సభ్యులు, రాష్ట్రంలో వారు కలిసినవారు అందరూ కలిసి మరో 3,000 మంది వరకు ఉన్నట్లు గుర్తించి వారీనందరినీ కూడా క్వారంటైన్‌లోకి పంపించాము. వీరుగాక మరో 30-35 మంది డిల్లీలో క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిసింది. 

రాష్ట్రంలో క్వారంటైన్‌లో ఉన్న వారందరికీ కూడా వైద్య పరీక్షలు జరిపించాము. ఒకటి రెండు రోజులలో అందరి రిపోర్టులు వస్తే  రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల కధ ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నాము. అక్కడితో రాష్ట్రంలో కరోనా కేసులు ఆగుతాయని కూడా భావిస్తున్నాము. 

కరోనా వైరస్ శరీరాన్ని పూర్తిగా కమ్ముకొన్న తరువాత వారిని ఎవరూ కాపాడలేరు. వారు తమ ప్రాణాలను కోల్పోవడమే కాక, వారి వలన వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కనుక మార్కజ్ సమావేశాలకు వెళ్ళివచ్చినవారు రాష్ట్రంలో ఇంకా ఎవరైనా ఉంటే వారందరూ తక్షణమే బయటకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.


Related Post