లాక్‌డౌన్‌లో బయటకువస్తే ముద్ర పడుతుంది అక్కడ

March 27, 2020


img

కరోనా వైరస్‌కు ఇంతవరకు తగిన మందులు కనిపెట్టలేదు కనుక దాని వ్యాప్తిని అరికట్టడమే ఏకైక మార్గమని రుజువు అవడంతో ప్రధాని నరేంద్రమోడీ దేశంలో 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించారు. మొదటిసారి జనతా కర్ఫ్యూ విధించినప్పుడు నిఖాచ్చిగా పాటించిన దేశప్రజలు లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ యధాప్రకారం రోడ్లపై తిరుగుతూనే ఉన్నారు. అయితే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున రోడ్లపై పోలీసులను మోహరించి బయటకు వచ్చినవారిపై కేసులు నమోదు చేస్తూ, వాహనాలను స్వాధీనం చేసుకొంటుండటంతో ప్రజలు బయటకు రావడం తగ్గించారు. కానీ నేటికీ నిత్యావసర సరుకులు కొనాలనే వంకతో కొందరు రోడ్లపై తిరుగుతూనే ఉన్నారు.

దాంతో కొన్ని రాష్ట్రాలలో పోలీసులు లాఠీలు బయటకు తీస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో రోడ్లపై గుంజీలు తీయిస్తున్నారు. నడిరోడ్డుపై పడుకోబెట్టిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్‌.ఎస్.పురా పోలీసులు మాత్రం అటువంటివేవీ చేయకుండా లాక్‌డౌన్‌ సమయంలో రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులను పట్టుకొని వారి నుదుటపై రెండు చేతులపై ‘కరోనా లాక్‌డౌన్‌ అతిక్రమించిన వ్యక్తి’ అని ముద్ర వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్ల వేలిపై వేసే ఇంకుతోనే ఆ ముద్రలు వేస్తుండటంతో 15-20 రోజుల వరకు అది చెరిగిపోకుండా ఉంటుంది. మళ్ళీ రోడ్లపై తిరుగుతూ పట్టుబడితే ఈసారి కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తామని పోలీసులు ముందే హెచ్చరిస్తున్నారు కనుక ముద్రపడినవారు రోడ్లపైకి వచ్చే సాహసం చేయడంలేదు. 


Related Post