తెలంగాణ ప్రజలకు తెరాస బీ-టీం: కవిత

March 16, 2019


img

తెరాస ఎంపీ కవిత నిజామాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ వాళ్లేమో బిజెపికి తెరాస బీ-టీం అంటారు. బిజెపి వాళ్లేమో కాంగ్రెస్‌కు తెరాస బీ-టీం అంటుంటారు. కానీ మేము తెలంగాణ ప్రజలకు మాత్రమే బీ-టీంలాగా పనిచేస్తున్నాము. రాష్ట్ర ప్రజలు మాకు బాధ్యత అప్పజెప్పినందున మేమందరం విభజన హామీల అమలు కోసం పార్లమెంటులోపలా బయట కేంద్రప్రభుత్వంతో కొట్లాడి రాష్ట్రానికి ఎయిమ్స్ ఆసుపత్రిని, నిజామాబాద్‌ రైల్వే లైన్ వంటివన్నీ సాధించుకొన్నాము. కనుక రాష్ట్ర ప్రజలు తెరాసకు-16, మజ్లీస్-1 ఎంపీ స్థానాలలో గెలిపిస్తే మేము వారి తరపున డిల్లీలో సైనికుల్లా పోరాడి రాష్ట్రానికి రావలసినవన్నీ సాధించుకొస్తాము. 

కాంగ్రెస్, బిజెపీలు నాణేనికి బొమ్మాబొరుసువంటివి. వాటిలో దేనికి ఓటేసినా ఒక్కటే. వాటి వలన రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అవి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు, వాటిపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రాఫెల్, బోఫర్స్ కుంభకోణాల వంటి అంశాలను తెరపైకి తెస్తున్నాయి. ప్రజలు ప్రాంతీయపార్టీలవైపు మొగ్గు చూపడానికి కారణం జాతీయపార్టీల వైఫల్యాలే. 

సిఎం కేసీఆర్‌ మంచి విజన్ ఉన్న నాయకుడు గనుకనే ఇదంతా సాధ్యం అయ్యింది. ఆయన ప్రవేశపెట్టిన పధకాలు, అమలుచేస్తున్న అభివృద్ధి పధకాలు ఇప్పుడు దేశంలో అనేక రాష్ట్రాలకు, రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. చివరికి మోడీ ప్రభుత్వం కూడా మన రైతుబందు పధకాన్ని కాపీ కొట్టాలని ప్రయత్నించింది కానీ సరిగ్గా కాపీ కొట్టలేకపోయింది.

గత ఏడు దశబ్దాలలో తెలంగాణ పరిస్థితి ఏవిదంగా ఉండేది?తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత గత నాలుగున్నరేళ్ళలో తెలంగాణ రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి చెందిందో ప్రజలు స్వయంగా బేరీజు వేసుకొని చూసి ఓట్లు వేయాలని కోరుతున్నాను. లోక్‌సభ ఎన్నికలలో 16 మంది తెరాస అభ్యర్ధులను గెలిపించాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.  


Related Post