డిసెంబరు12న ఎవరెవరు రాజకీయ సన్యాసం చేస్తారో?

December 09, 2018


img

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేవరకు గడ్డం గీయించుకోనని, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి శపధం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రజాకూటమి నేతలు శనివారం మీడియాతో మాట్లాడుతూ, “ప్రజాకూటమికి 75-80 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. కనుక డిసెంబరు 11 లేదా 12న నేను గడ్డం గీయించుకొంటాను,” అని చెప్పారు. సీనియర్ కాంగ్రెస్‌ నేత, ముఖ్యమంత్రి కావాలని కలలుకంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఓ శపధం చేశారు. నల్గొండలో కాంగ్రెస్ పార్టీకి కనీసం 10 సీట్లు గెలిపించలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని శపధం చేశారు. 

ఒకవేళ తెరాస ఓడిపోతే ఫాంహౌసుకు వెళ్ళిపోతానని సిఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ‘తెరాస మళ్ళీ అధికారంలోకి రాలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని, మళ్ళీ మీడియా ముందుకు రానని’ కేటిఆర్‌ కూడా శపధం చేశారు. 

జగిత్యాల నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ నేత జీవన్ రెడ్డి, ఆలేరు నుంచి పోటీ చేసిన బిఎల్ఎఫ్ అభ్యర్ధి మోత్కుపల్లి నర్సింహులు ఇద్దరూ ఇవే తమకు చివరి ఎన్నికలని ప్రకటించారు. ఒకవేళ ఈ ఎన్నికలలో తెరాస గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే, వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడం ఖాయం. 

కనుక ప్రజాకూటమి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే డిసెంబరు 12న ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం గీయించుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. అప్పుడు కేసీఆర్‌, కేటిఆర్‌ రాజకీయ సన్యాసం స్వీకరించవలసి ఉంటుంది. అదే తెరాస గెలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ నేతలు రాజకీయ సన్యాసం పుచ్చుకోవలసివస్తుంది. ఇదేవిధంగా మరికొంతమంది సీనియర్ కాంగ్రెస్‌ నేతలు కూడా ‘ఆరోగ్యకారణాలతో’ రాజకీయాలలో నుంచి తప్పుకొనే అవకాశం ఉంది. కనుక డిసెంబరు12న ఎవరో ఒకరు రాజకీయ సన్యాసం చేయక తప్పదు. అది ఆ పార్టీల రాజకీయ భవిష్యత్తుపై తీవ్రప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది కనుక డిసెంబరు12న ‘రాజకీయ సన్యాసం దినం’గా ప్రకటిస్తే బాగుంటుందేమో? 


Related Post