రాహుల్ విమర్శలకు కెసిఆర్ కౌంటర్

August 14, 2018


img

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌ పర్యటనతో కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌, బిజెపిల మద్య మాటల యుద్దం కొనసాగుతోంది. రాహుల్ గాంధీ ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్‌ లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుంటే, టిఆర్ఎస్‌, బిజెపి నేతలు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలనపై ప్రతివిమర్శలు చేస్తున్నారు. రాఫెల్ యుద్దవిమానాల కొనుగోలు వ్యవహారంలో మోడీ సర్కార్ అవినీతికి పాల్పడిందని, అక్కడ మోడీ ఇక్కడ కెసిఆర్ దొందూ దొందేనని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించడంతో టిఆర్ఎస్‌, బిజెపిలు స్పందించక తప్పలేదు. 

రాహుల్ గాంధీ విమర్శలకు సిఎం కెసిఆర్‌ స్వయంగా జవాబిచ్చారు. రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోందని రాహుల్ గాంధీ చేసిన వింర్శలకు బదులిస్తూ, “దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ కుటుంబం ఏమి చేసిందో తెలియదు కానీ మా కుటుంబ సభ్యులు అందరూ తెలంగాణా రాష్ట్ర సాధన కోసం సైనికులలాగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో సాగుతున్న కుటుంబపాలన కంటే మా కుటుంబపాలన వలన రాష్ట్రానికి మంచే జరుగుతోంది. కాంగ్రెస్‌లో కుటుంబపాలన వలన దేశానికి ఏమి మేలు జరిగిందో వారే చెప్పాలి,” అని అన్నారు.

“ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్రాసి ఇచ్చింది చదవుతూ రాహుల్ గాంధీ నవ్వులపాలవుతున్నారు. మేము 5లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మిస్తామని చెపితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి 50 లక్షల ఇళ్ళు అని చెప్పారు. రాహుల్ గాంధీ వాస్తవాలు తెలుసుకోకుండా ఆయన చెప్పిందే చదివేరు. కనుక రాహుల్ గాంధీ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే హుందాగా ఉంటుంది. రాహుల్ గాంధీని చూసి నేను భయపడిపోతున్నానని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకోవడం చూసి ప్రజలు కూడా నవ్వుకొంటున్నారు. ఆయనను చూసి నేనెందుకు భయపడాలి? కావాలంటే ఆయనను హైదరాబాద్‌లోనే ఓ ఆరు నెలలు ఉంది దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్‌ వ్యవహారాలు చక్కబెట్టుకొన్నా నాకేమీ అభ్యంతరం లేదు. రాహుల్ గాంధీ తన స్థాయికి తగ్గట్లుగా హుందాగా వ్యవహరించి తిరిగివెళితే బాగుంటుంది,” అని కెసిఆర్ అన్నారు.


Related Post