అధిష్టానంపై హనుమంతన్న అసంతృప్తి

July 19, 2018


img

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తన పార్టీ అధిష్టానం వైఖరిపై తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో అత్యున్నత విధాననిర్ణయ కమిటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసి)లో తెలంగాణా నుంచి ఒక్కరికి కూడా   అవకాశం కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “ఇక్కడ మేము రోజూ తెరాస సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడుతుంటాము. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి పట్టుదలగా పనిచేస్తున్నాము. కానీ మా ప్రయత్నాలను మా అధిష్టానం పట్టించుకోలేదు. సిడబ్ల్యూసిలో రాష్ట్ర నేతలు ఎవరికీ అవకాశం కల్పించకపోవడం వలన రేపు తెరాస మమ్మల్ని అవహేళన చేయదా? మాకు మా అధిష్టానం వద్దే గౌరవం లేదని నిలదీయదా?మమ్మల్నే పట్టించుకోని కాంగ్రెస్ అధిష్టానం ఇక తెలంగాణా రాష్ట్రాన్ని ఏమి పట్టించుకొంటుందని నిలదీయరా? సిడబ్ల్యూసిలో తెలంగాణా నేతలు ఎవరినీ తీసుకోకపోవడం వలన కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకు తెరాసకు చేజేతులా అవకాశం కల్పించినట్లయింది. ఒకప్పుడు ఎన్టీఆర్ ‘తెలుగువారి ఆత్మగౌరవం’ అంటూ హడావుడి చేసినట్లే తెరాస కూడా తెలంగాణా ప్రజల ఆత్మగౌరవం అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదు. అదే.. సిడబ్ల్యూసిలో రాష్ట్ర నేతలు ఎవరికైనా అవకాశం కల్పించి ఉంటే, తెరాస సర్కార్ పై మరింత హుషారుగా పోరాడేందుకు టి-కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలలో  నూతనోత్సాహం నింపి ఉండేది కదా,” అని అన్నారు.


Related Post