మూడు స్థానాలకు ఐదుగురు పోటీ

March 13, 2018


img

రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లకు ఐదుగురు అభ్యర్ధులు నామినేషన్స్ వేశారు. శాసనసభ్యుల కోటాలో జరుగబోయే ఈ ఎన్నికలలో విజయం సాధించాలంటే కనీసం 30 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. తెరాస తరపున జోగినిపల్లి సంతోష్ కుమార్, బండా ప్రకాష్, బడుగుల లింగయ్య సోమవారం నామినేషన్స్ వేశారు. వారిని గెలిపించుకోవడానికి తెరాస వద్ద తగినంత ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ కేవలం 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కలిగిన కాంగ్రెస్ కూడా మాజీ ఎంపి పోరిక బలరాం నాయక్ ను అభ్యర్ధిగా బరిలో దింపింది. శ్రమశక్తి పార్టీ నేత జాజుల భాస్కర్ కూడా నిన్న తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. 

కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతుగా సిఎల్పి నేత కె.జానారెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, గీతారెడ్డి తదితరులు, తెరాస అభ్యర్ధికి మద్దతుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపిలు తదితరులు వచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వేదాంతం నర్సింహాచార్యులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. 

మంగళవారం నామినేషన్లు పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 15వరకు గడువు ఉంది. మార్చి 23న పోలింగ్, ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు అదే రోజు వెల్లడిస్తారు. అయితే, శాసనసభ్యుల మద్దతుతో ఎంపిక జరుగుతుంది కనుక తెరాస తరపున నామినేషన్స్ దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్ధులు గెలిచినట్లు ప్రకటించడం కేవలం లాంఛనప్రాయమేనని చెప్పవచ్చు.


Related Post