టిఎస్‌పీఎస్సీలో ఇంటి దొంగలు...ఎందరో?

March 23, 2023
img

టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఇంటి దొంగలు ఇంకా చాలామందే ఉన్నట్లు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనుమానిస్తున్నారు. ఈరోజు టిఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్న దాదాపు 40 మంది ఉద్యోగులను ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది. వారి దర్యాప్తులో టిఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్న 20 మంది గ్రూప్-1 ప్రిలిమ్స్ వ్రాయగా వారిలో 8 మంది అర్హత సాధించారు. వారిలో సురేష్, దామెర రమేశ్ కుమార్, షమీమ్ అనే ముగ్గురు ఉద్యోగులు 100కు పైగా మార్కులు సాధించిన్నట్లు పోలీసులు గుర్తించారు. వారు ముగ్గురిలో సురేష్కు ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌తో మంచి దోస్తీ ఉన్నట్లు గుర్తించారు. వీరు ముగ్గురూ ముందుగా ప్రశ్నాపత్రాలు సంపాదించి పరీక్ష వ్రాసిన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కనుక వీరి ముగ్గురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నిందితుల సంఖ్య 12కి చేరింది. 

రాష్ట్రంలో మొత్తం 2.85 లక్షల మంది గ్రూప్-1 ప్రిలిమ్స్ వ్రాశారు. మిగిలిన పరీక్షలకు కూడా భారీగానే అభ్యర్ధులు హాజరయ్యారు. కానీ టిఎస్‌పీఎస్సీలో ఈ ఇంటి దొంగల కారణంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు కావడంతో వారందరూ నష్టపోయారు. ఈ లెక్కన టిఎస్‌పీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తే, తాము గ్రామాల నుంచి హైదరాబాద్‌ వచ్చి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకొని, రేయింబవళ్లు కష్టపడి చదివి ఏం ప్రయోజనమని ఈ పరీక్షలు వ్రాసిన అభ్యర్ధులు ప్రశ్నిస్తున్నారు. 

టిఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌తో సహా బోర్డు సభ్యులందరినీ తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నందున ఇది బిఆర్ఎస్‌-ప్రతిపక్షాల రాజకీయ వ్యవహారంగా కూడా మారింది. కనుక చివరికి ఇది ఏవిదంగా ముగుస్తుందో... ఇంకా ఎప్పటికు ముగుస్తుందో తెలీని పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతున్నందున ఇప్పట్లో టిఎస్‌పీఎస్సీ మరే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయకపోవచ్చు. ఒకవేళ చేసినా ఎవరో ఒకరు హైకోర్టులో పిటిషన్‌ వేసి అడ్డుకోవచ్చు. ఎంతో ఆశగా ఈ ఉద్యోగాల కోసం ఏళ్ళ తరబడి ఎదురుచూతున్న నిరుద్యోగులకు ఈ పరిణామాలు చాలా బాధాకరమైనవే.

పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ టిఎస్‌పీఎస్సీలో ఇంటి దొంగలు బయటపడుతుండటంతో టిఎస్‌పీఎస్సీ విశ్వసనీయత, ప్రతిష్ట మసకబారుతోంది.

Related Post