వచ్చే విద్యాసంవత్సరం నుంచి తెలంగాణ ఇంటర్ సిలబస్ మార్పు

November 12, 2022
img

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్‌ సిలబస్ మారబోతోంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఇంటర్ బోర్డు పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. ఈప్పటికే తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టుల సిలబస్ మార్చినందున వచ్చే విద్యాసంవత్సరంలో మిగిలిన అన్ని సబ్జెక్టుల సిలబస్ కూడా మార్చాలని నిర్ణయించారు. ఏటా పాఠ్యపుస్తకాలను అందించడం చాలా ఆలస్యమవుతున్నందున వచ్చేవిద్యాసంవత్సరం కోసం కొత్త సిలబస్‌తో వీలైనంత త్వరలో ముద్రణ ప్రారంభించాలని నిర్ణయించారు.

ఇకపై ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు (అఫిలియేషన్)నిచ్చే ప్రక్రియను ఏటా మే నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. బాల,బాలికలకు కలిపి ప్రైవేట్ జూనియర్ కాలేజీలను నిర్వహిస్తున్న మరో ఒకటి లేదా రెండు సంవత్సరాల వరకు మాత్రమే అనుమతించాలని తర్వాత తప్పనిసరిగా వేర్వేరు భవనాలలోకి మార్చాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అటువంటి కళాశాలలు 432 ఉన్నాయని వాటన్నిటికీ అగ్నిమాపక నియమనిబందనలు (ఫైర్ సేఫ్టీ) విధిగా పాటించేలా చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ పొందనంతవరకు ఇంటర్ బోర్డు గుర్తింపు ఇవ్వడం సాధ్యం కాదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.  

ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డీ రవీందర్‌, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Related Post