డీఏవీ స్కూల్‌ పునః ప్రారంభం... ప్రభుత్వం తొందరపడిందా?

November 02, 2022
img

హైదరాబాద్‌, బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌ పునః ప్రారంభం కాబోతోంది. అందుకు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. దానిలో చదువుకొంటున్న సుమారు 700 మంది విద్యార్థుల చదువులు, వారి భవిష్యత్‌, తల్లితండ్రుల ఒత్తిళ్ళ కారణంగా స్కూలుని పునః ప్రారంభించడానికి అనుమతించవలసి వచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దానిలో పేర్కొన్న షరతులు, నియమ నిబంధనలు:

ఈ గుర్తింపు ఈ విద్యాసంవత్సరానికి మాత్రమే పరిమితం. వచ్చే ఏడాది మళ్ళీ ప్రభుత్వం దీనిపై పునరాలోచించి తగిన నిర్ణయం తీసుకొంటుంది. ప్రస్తుతం ఉన్న మేనేజిమెంటుని పూర్తిగా తొలగించాలి. కొత్త మేనేజిమెంట్‌లో విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లితండ్రులుకూడా ఉండాలి.

స్కూల్లో అవకతవకలపై డీఈవో విచారణ జరిపి చర్యలు తీసుకొంటారు. ఆరోపణలు వచ్చిన ఉపాధ్యాయులందరినీ తక్షణం ఉద్యోగాలలో నుంచి తొలగించాలి. ఇక నుంచి ప్రతీ నెల డీఈవోకు స్కూల్ స్టేటస్ రిపోర్ట్ తప్పక సమర్పించాలి. ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా 6,7 తరగతులను నిర్వహిస్తుండటం, సీబీఎస్ఈ సిలబస్ భోధిస్తున్నందుకు, డీఈవో బాధ్యులపై చర్యలు తీసుకొంటారు.   

ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు ప్రతినెలా డీఈవో స్కూల్‌ స్టేటస్‌ రిపోర్ట్‌ సమర్పించాలి. 2017లో ప్రభుత్వం జారీ చేసిన జీవో-36లో పేర్కొన్న మార్గదర్శకాలన్నిటినీ కొత్త మేనేజిమెంట్ విధిగా అమలుచేయాలి.  

గత నెల 18వ తేదీన స్కూల్లో పనిచేస్తున్న రజనీకుమార్‌ (34) అనే బస్సు డ్రైవరు ఓ ఎల్‌కెజీ విద్యార్ధినిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం స్కూల్ ప్రిన్సిపల్ ఎస్.మాధవికి తెలిసి ఉన్నప్పటికీ అతనిని అడ్డుకోలేదు. అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈవిషయం బయటకు పొక్కడంతో పోలీసులు ఆమెను, బస్సు డ్రైవరును అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ స్కూలు గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే స్కూలులో కొందరు లేదా మేనేజిమెంట్ తప్పు చేస్తే వారిని తొలగించాలి కానీ ఏకంగా స్కూలు గుర్తింపును రద్దు చేసి 700 మంది విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్ధకంగా మార్చడం సరికాదని తల్లితండ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకతప్పలేదు. ఈ విషయంలో ప్రభుత్వం కాస్త తొందరపాటు ప్రదర్శించినట్లే అర్దం అవుతోంది. 

Related Post