బాసర ట్రిపుల్ ఐ‌టి విద్యార్థులతో మంత్రి కేటీఆర్‌ భేటీ

September 27, 2022
img

బాసర ట్రిపుల్ ఐ‌టిలో మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం పర్యటించి విద్యార్థులతో ముఖాముఖీ భేటీ అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఆ తర్వాత వారందరూ తరగతి గదులు, హాస్టల్‌, క్యాంటీన్‌లలో పర్యటించి స్వయంగా అన్నీ పరిశీలించి విద్యార్థులు చెపుతున్న సమస్యల గురించి ట్రిపుల్ ఐ‌టి అధికారులతో మాట్లాడి తెలుసుకొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రులు భోజనాలు చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ వారితో మాట్లాడుతూ, “నేను కూడా హాస్టల్‌లో ఉండే చదువుకొన్నాను. కనుక హాస్టల్లో మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నాకు తెలుసు. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మీరు ఆందోళన చేసిన విదానం నాకు నచ్చింది. రాజకీయపార్టీలకు దూరంగా వారం రోజులు బయట ఎండ, వానలో ప్రశాంతంగా ఆందోళన చేశారు. హాస్టల్‌లో సమస్యలన్నీ తప్పకుండా పరిష్కరిస్తాము. మీరందరూ కూడా మీ హాస్టల్, క్యాంపస్‌ ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడూ ఉద్యోగాలు ఎలా పొందాలని ఆలోచనలతో సరిపెట్టుకోకుండా మీరే స్వయంగా ఓ ఐ‌టి కంపెనీలు, పరిశ్రమలు, సంస్థలు స్థాపించి పదిమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని నేను కోరుకొంటున్నాను. ఇందుకోసం ఇక్కడే ఓ ఐ‌టి హబ్ ఏర్పాటు చేస్తాం,” అని అన్నారు. 

రెండు నెలల క్రితం బాసర ట్రిపుల్ ఐ‌టి విద్యార్థులు ఆందోళన చేసినప్పుడు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చి వారితో ఇలాగే భేటీ అయ్యి సమస్యలు అడిగి తెలుసుకొని హామీలు ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్ని పనులు జరిగినప్పటికీ నేటికీ అనేక సమస్యలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆమెతో సహా మరో ముగ్గురు మంత్రులు వచ్చి హామీలు ఇచ్చి వెళ్లారు. 

విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐ‌టికి మంత్రులను రప్పించగలుగుతున్నారు కానీ మంత్రులు హామీలు అమలుచేయలేకపోతున్నారు. ప్రభుత్వంలో సిఎం కేసీఆర్‌ తర్వాత రెండో స్థానంలో ఉన్న మంత్రి కేటీఆర్‌ ఇప్పుడు వచ్చారు కనుక ఇకనైనా బాసర ట్రిపుల్ ఐ‌టికి నిధులు కేటాయించి తాము చెపుతున్న సమస్యలన్నిటినీ పరిష్కరిస్తారని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. 

Related Post