నేడు ఉపాధ్యాయ దినోత్సవం

September 05, 2021
img

అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు గురువు. తొలి ఉపరాష్ట్రపతి, దౌత్యవేత్త, ఆచార్యుడైన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మ దినోత్సవం సందర్భంగా ఏటా సెప్టెంబర్ 5వ తేదీన ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుతని గ్రామంలో 1888లో  జన్మించారు.

ఆచార్యుడిగా, ఉపకులపతిగా, దౌత్యవేత్తగా, తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా పదవులు చేపట్టి ఆ పదవులకే వన్నె తెచ్చారు. చిన్నతనం నుండే ఆయన అసాధారణమైన తెలివితేటలు ప్రదర్శించేవారు. ఆయన ప్రాథమిక విద్య తిరుత్తనిలో సాగింది. ఆ తర్వాత ఆయన ఉన్నత చదువులు తిరుపతి, నెల్లూరు, మద్రాస్‌లలో పూర్తిచేశారు. 21 సంవత్సరాలకే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యారు. ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయం ఆచార్యునిగా పదవి  చేపట్టాలని డా.అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కోరడంతో ఆ పదవి చేపట్టారు. కలకత్తాలో ఉన్నప్పుడే ఆయన 'భారతీయ తత్వశాస్త్రం’ అనే గ్రంథాన్ని వ్రాశారు. 1946లో భారత రాజ్యాంగ పరిషత్‌లో సభ్యుడిగా పని చేశారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా మొట్టమొదటి ఉపరాష్ట్రపతి పదవి వరించింది.ఆ తర్వాత మళ్ళీ మరోసారి రాష్ట్రపతిగా చేశారు. ఆయన చైనా, పాకిస్తాన్ యుద్ధ సమయాలలో అప్పటి ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు 1954లో భారత రత్న అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించింది. ఆయన 1975, ఏప్రిల్ 17వ తేదీన పరమపదించారు.

నేటి ఆధునిక కాలంలో విద్యార్థి, ఉపాధ్యాయులకి మధ్య సంబంధం ఎలా ఉండాలో రాధాకృష్ణన్ జీవితం మనకు  పాఠాలు నేర్పుతుంది.

Related Post