టిఎస్‌పీఎస్సీలోనే ఖాళీలు ఇక నోటిఫికేషన్లు ఎలా?

February 23, 2021
img

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టిఎస్‌పీఎస్సీ) ఎప్పుడు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తుందా...అని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. కానీ ఉద్యోగాలను భర్తీ చేయవలసిన టిఎస్‌పీఎస్సీలోనే చిరకాలంగా ఖాళీలను భర్తీ చేసుకోలేకపోతోంది. గత డిసెంబర్‌లోనే టిఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఇతర సభ్యులు సి.విట్టల్, చంద్రావతిల పదవీకాలం ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం టిఎస్‌పీఎస్సీ తాత్కాలిక చైర్మన్‌గా కృష్ణారెడ్డిని నియమించింది. కృష్ణారెడ్డి పదవి కాలం కూడా ఈ నెలతో ముగియనుంది. ఉద్యోగాల భర్తీకి టిఎస్‌పీఎస్సీలో కోరం ఉంటేనే ఉద్యోగాల భర్తీపై చర్చించి ఆమోదముద్ర వేసి నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంటారు.

కోరంలో మొత్తం ఐదుగురు సభ్యులుగా ఉంటారు. వీరిలో ఇదివరకే ముగ్గురు సభ్యుల పదవీకాలం ముగిసింది. తాత్కాలిక చైర్మన్ పదవీ కాలం కూడా ఈ నెలతో ముగియనుంది. ఇప్పుడు టిఎస్‌పీఎస్సీలో ఒకే ఒక్క సభ్యుడు సాయిలు మాత్రమే ఉన్నారు. కనుక నిబందనల ప్రకారం ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం సమావేశం నిర్వహించేందుకే వీలుపడదు. ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా 50,000 ఉద్యోగాలను భర్తీ చేయగలదు? కనుక ప్రభుత్వం ముందుగా టిఎస్‌పీఎస్సీలో ఖాళీలను భర్తీ చేయవలసి ఉంటుంది. ఆ తరువాతే50,000 ఉద్యోగాలకు టిఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేయగలుగుతుంది.

త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడతాయని భావిస్తూ మరోవైపు నిరుద్యోగులు తమ పనులన్నీ మానుకొని కోచింగ్ సెంటర్‌లకు పరుగులు తీస్తున్నారు. ఈ విషయం తెలియడంతో  నిరుద్యోగులు నిరాశకు లోనవుతున్నారు. ప్రభుత్వం వెంటనే టిఎస్‌పీఎస్సీలో పూర్తికాలపు చైర్మన్, ఇతర సభ్యులను నియమించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Related Post