త్వరలో ఇంటర్ సిలబస్, పరీక్షల షెడ్యూల్

January 20, 2021
img

కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుండి తెలంగాణలో విద్యావ్యవస్థలు మూతపడ్డాయి. పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొని ఉన్నందున విద్యార్దులను పై తరగతులకు ప్రమోట్ చేయవలసి వచ్చింది. కరోనా భయాలతో ఇంతవరకు విద్యార్దులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ అవి అంత సంతృప్తికరంగా సాగడంలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా తీవ్రత బాగా తగ్గుముఖం పట్టింది కనుక స్కూళ్ళు తెరిచి 9,10 తరగతులు నిర్వహించడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్ తరగతులు కూడా మొదలుకానున్నాయి. అయితే విద్యార్దులకు, అధ్యాపకులకు కరోనా సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? విద్యాసంవత్సరాన్ని కుదించినందున దానికి తగ్గట్టు సిలబస్, తరగతులు, పరీక్షలలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి?వంటి పలు అంశాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే అధికారులతో పలుమార్లు చర్చించారు. మంగళవారం ఆమె ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్దుల తల్లితండ్రుల కమిటీల ప్రతినిధులతో కూడా సమావేశమయ్యి వారితో ఈ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో హైస్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీలను మళ్ళీ తెరిచి తరగతులు మొదలుపెట్టేందుకు అందరూ పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎంసెట్ పరీక్ష సిలబస్ కూడా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. వారం రోజులలోగా ఇంటర్ సిలబస్, ప్రాక్టికల్స్, పరీక్షల షెడ్యూల్ వగైరాలను ప్రకటిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Related Post