మెట్రో రైల్ ట్రావెల్ కార్డ్ అమ్మకాలు షురూ

November 23, 2017
img

ఈ నెల 28వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు మొదలు కాబోతున్నందున వాటిలో ప్రయాణించేందుకు ప్రీ-పెయిడ్ మెట్రో ట్రావెల్ కార్డ్స్ అమ్మకాలు మొదలయ్యాయి. ఈ ప్రీ-పెయిడ్ కార్డులు ముందుగా ఐటి ఉద్యోగులకు అందుబాటులోకి వచ్చాయి. మాదాపూర్ లోగల రహేజా మైండ్ స్పేస్ పార్క్ లో 5ఏ భవనం వద్ద వీటి కోసం ఒక కియోస్క్ ఏర్పాటు చేయబడింది. దానిలో రూ.200 విలువగల కార్డులు లభిస్తున్నాయి. 

ఈ కార్డులు తీసుకొన్నవారు మెట్రో స్టేషన్స్ వద్ద టికెట్స్ కోసం క్యూ లైన్స్ లో నిలబడనవసరం లేకుండా నేరుగా స్టేషన్ లోని ఆటోమేటిక్ టికెట్ కలెక్షన్ గేట్స్ వద్ద కార్డును స్వైప్ చేసి లోపలకు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ గమ్యస్థానంలో దిగినప్పుడు అక్కడ కూడా ఈ కార్డును స్వైప్ చేయవలసి ఉంటుంది. అప్పుడు ప్రయాణించిన దూరానికి కార్డులో నుంచి టికెట్ ధరకు సరిపడా మొత్తం కట్ అవుతుంది. ఒకసారి ఈ కార్డులను కొనుగోలు చేసినట్లయితే ఆ తరువాత మొబైల్ ఫోన్స్ లాగే వాటిని కూడా అవసరమైనప్పుడల్లా కావలసినంత మొత్తంవేసి రీ-ఛార్జ్ చేయించుకోవచ్చు. కనుక నిత్యం మెట్రోలో  ప్రయాణించేవారికి ఈ కార్డులు చాలా సౌకర్యవంతంగా ఉంటాయని భావించవచ్చు. అన్ని మెట్రో రైల్వే స్టేషన్లలో కూడా ఈ ప్రీ-పెయిడ్ కార్డులు లభిస్తాయని తెలుస్తోంది. 


Related Post