హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు అంచనా రూ.19,000 కోట్లు

May 14, 2025
img

హైదరాబాద్‌లో మెట్రో రెండో దశలో మలి విస్తరణకు డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)కు హైదరాబాద్‌ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటెడ్ బోర్డు ఆమోదం తెలిపింది. మూడు మార్గాలలో 86.5 కిమీ మేర నిర్మించబోయే మెట్రో కారిడార్‌కు రూ.19,000 కోట్లు ఖర్చు అవుతుందని డీపీఆర్‌లో పేర్కొన్నారు. దీనికి బోర్డు ఆమోదం తెలుపడంతో, మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసి, నిధులు, అనుమతుల కోసం కేంద్రానికి సమర్పిస్తారు. దీని కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 18:30 నిష్పత్తిలో నిధులు సమకూర్చుతాయి. మిగిలిన దానిలో 48% బ్యాంకుల నుంచి రుణాలు, మరో 4% పిపిపి పద్దతిలో నిధులు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. 

1. జేబీఎస్-కార్ఖానా, ఆల్వాల్, హకీంపేట, తూంకుంట మీదుగా శామీర్ పేట వరకు మెట్రో కారిడార్ (22 కిమీ). 

2. జేబీఎస్-తాడ్‌బండ, బోయినపల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్ వరకు మెట్రో కారిడార్ (24.5 కిమీ).

3. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో కారిడార్ (40 కిమీ).         

జేబీఎస్-శామీర్ పేట మెట్రో కారిడార్ మద్యలో హకీంపేట వద్ద ఎయిర్ బేస్ ఉన్నందున, అక్కడ సుమారు 1.5 కిమీ పొడవునా రన్ వే కింద భూగర్భంలో మెట్రో కారిడార్ నిర్మించనున్నారు. 

శంషాబాద్ విమానాశ్రయం - ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్‌లో రావీర్యాల ఓఆర్ఆర్ వరకు ఎలివేటడ్ కారిడార్ నిర్మిస్తారు. అక్కడి నుంచి గ్రీన్ ఫీల్డ్ రహదారి మద్యగా భూమార్గంలో (18 కిమీ) కారిడార్ నిర్మిస్తారు.

Related Post