ప్రభాస్ అభిమానులకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తమ కాంబినేషన్లో సిద్ధం చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా మొదట 2027, మార్చి 5న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు దీపావళి కానుకగా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు సందీప్ వంగా ప్రకటించారు. అలాగే అభిమానుల కోసం ప్రభాస్ కొత్త పోస్టర్ను కూడా విడుదల చేశారు.
దానిలో ప్రభాస్ క్యాప్, కూలింగ్ గ్లాసస్తో చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. ‘వన్ బ్యాడ్ హ్యాబిట్’ అనే క్యాప్షన్తో విడుదలైన ఈ పోస్టర్ చూసి అభిమానులు ఉత్సాహంతో పొంగిపోతున్నారు.
ప్రభాస్ తొలిసారిగా పోలీస్ అధికారిగా నటిస్తున్న సినిమా ఇది. కనుక ఇలాంటి సినిమాను ఆరు నెలలు ముందుగా విడుదల చేస్తున్నందుకు అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.
ఈ సినిమాలో ప్రభాస్, తృప్తి డిమ్రి జంటగా నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్, కాంచన తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా, సందీప్ రెడ్డి వంగా కలిసి నిర్మిస్తున్న స్పిరిట్ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకత్వం చేస్తున్నారు.