టీకా వికటించి అంగన్‌వాడి టీచర్ మృతి?

January 25, 2021
img

వరంగల్‌ అర్బన్ జిల్లా కేంద్రంలోని దీనదయాళ్ నగర్‌ కాలనీలో విధులు నిర్వర్తిస్తున్న గన్నారపు వనిత (49) అనే అంగన్‌వాడి టీచర్ కరోనా టీకా తీసుకొన్న రెండురోజుల తరువాత శనివారం రాత్రి హటాత్తుగా చనిపోయింది. ఆమె ఈనెల 19న స్థానిక హెల్త్ వర్కర్లతో కలిసి కరోనా టీకా వేయించుకున్నారు. టీకా వేయించుకున్న తరువాత ఎటువంటి సైడ్-ఎఫెక్ట్స్ కనిపించలేదు. గురు, శుక్రవారాలలో యధాప్రకరం విధులకు కూడా హాజరయ్యారు. శనివారం ఉదయం నుంచి ఒంట్లో నలతగా ఉందని, ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో వైద్యులు ఆమెను పరీక్షించి మందులు ఇచ్చారు. శనివారం రాత్రి ఆమె ఇంటి పనులన్నీ చేసుకొని పడుకున్నారు. నిన్న ఉదయం ఆమె ఎంతకీ నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను నిద్రలేపేందుకు ప్రయత్నించగా ఆమె చనిపోయినట్లు గుర్తించి షాక్ అయ్యారు.  

ఆమె సోదరుడు రవి స్థానిక పోలీసులకు ఈ విషయం తెలియజేయగా వారు కేసు నమోదు చేసుకొని వనిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కరోనా టీకా వికటించడం వలననే ఆమె చనిపోయి ఉండవచ్చని ఆమె సోదరుడు అనుమానం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజారోగ్యశాఖ వనిత మృతిపై స్పందిస్తూ,        పోస్టుమార్టం రిపోర్ట్ అందితే కానీ ఆమె ఎందుకు చనిపోయిందో చెప్పలేమని తెలిపారు. వనిత భర్త ఇదివరకే చనిపోయాడు. ఇప్పుడు ఆమె కూడా చనిపోవడంతో ఆమె కుమార్తె సిరిప్రియ అనాధగా మారింది. ఆమెకు అండగా నిలబడతామని, తప్పకుండా ప్రభుత్వ సాయం అందేలా చేస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. 

ఇటువంటి ఘటనలు జరిగితే వాటిపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏఎఫ్ఈఐ కమిటీ కరోనా టీకా తీసుకొనక మునుపు వనిత ఆరోగ్యపరిస్థితి గురించి పూర్తి వివరాలను సేకరించింది. పోస్టుమార్టం రిపోర్ట్ రాగానే దాని ఆధారంగా పూర్తి నివేదికను రూపొందించి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తుంది.

Related Post