రాజ్‌భవన్‌లో 48 మందికి కరోనా పాజిటివ్

July 13, 2020
img

రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న 48 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. గవర్నర్ ఆదేశం ప్రకారం వైద్యఆరోగ్య సిబ్బంది శని, ఆదివారం రెండురోజులు రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న వారందరికీ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు   చేశారు. రాజ్‌భవన్‌లో ప్రత్యేక బెటాలియన్‌కు చెందిన 395 మంది పోలీసులు మూడు షిఫ్టులలో పనిచేస్తుంటారు. వారిలో 347 మందికి పరీక్షలు చేయగా 28 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. రాజ్‌భవన్‌ సిబ్బందిలో 10 మందికి, వారి కుటుంబ సభ్యులలో 10 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాజ్‌భవన్‌ అధికారులందరికీ పరీక్షలు చేయగా వారికి నెగెటివ్ వచ్చింది. 

సుమారు రెండు వారాల క్రితం ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్‌లోకి కరోనా మహమ్మారి చొరబడటంతో 30 మందికి కరోనా సోకింది. దాంతో ముందుజాగ్రత్త చర్యగా సిఎం కేసీఆర్‌ గజ్వేల్లోని తన నివాసానికి తరలివెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజ్‌భవన్‌లోకి కూడా కరోనా జొరబడింది కానీ వైద్యురాలైన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మొదటి నుంచి పూర్తి జాగ్రత్తలు పాటిస్తున్నందున కరోనా బారిన పడకుండా తప్పించుకోగలిగారు. అయితే ముఖ్యమంత్రి, గవర్నర్‌ వంటి అత్యున్నత వ్యక్తుల అధికార నివాసాలు కూడా కరోనా బారి నుంచి తప్పించుకోలేకపోతుండటం హైదరాబాద్‌ నగరంలో కరోనా తీవ్రతకు అద్దంపడుతోందని భావించవచ్చు.      


Related Post