తెలంగాణలో 39కి పెరిగిన కరోనా కేసులు

March 25, 2020
img

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో ఆరు కరోనా కేసులు నమోదు అయ్యాయి. వారిలో ముగ్గురు విదేశాల నుంచి వచ్చినవారు కాగా మరో ముగ్గురు స్థానికులు. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 39కి చేరుకొంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులు కొలుకొంటున్నారు. విదేశాల నుంచి వ్యక్తుల ద్వారానే రాష్ట్రంలోకి కరోనా వ్యాపిస్తోందని గుర్తించిన ప్రభుత్వం వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారెంటైన్ శిబిరాలకు తరలించడమో లేదా గృహనిర్బందంలో ఉంచుతోంది. కానీ భద్రాద్రి కొత్తగూడెంలో ఓ ఉన్నత పోలీస్ అధికారి ప్రభుత్వ ఆదేశాలకు విరుద్దంగా లండన్ నుంచి వచ్చిన తన కుమారుడిని విమానాశ్రయం నుంచి నేరుగా ఇంటికి తీసుకుపోయారు. లండన్ నుంచి వచ్చిన ఆ యువకుడికి కరోనా ఉండటంతో అతని ద్వారా ఆ పోలీస్ అధికారికి, వారి ఇంట్లో పనిచేస్తున్న వంటమనిషికి కూడా కరోనా సోకింది. దాంతో జిల్లా వైద్యాధికారులు వారి కుటుంబ సభ్యులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. అలాగే వారందరూ ఎక్కడెక్కడ తిరిగారు... ఎవరెవరిని కలిశారో తెలుసుకొని వారీనందరినీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సదరు పోలీస్ అధికారిని, ఆయన కుమారుడిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా లండన్ నుంచి వచ్చిన కుమారుడిని ఇంటికి తీసుకువెళ్ళి జిల్లాలో కరోనా వ్యాప్తికి కారణమైనందుకు సదరు పోలీస్ అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇప్పటివరకు విదేశాల నుంచి నేరుగా విమానాలలో రాష్ట్రానికి వచ్చినవారు 77,045 మందికాగా వారందరికీ ధర్మల్ స్క్రీనింగ్ చేసి వారిలో కరోనా లక్షణాలున్న 764 మందిని క్వారెంటైన్ శిబిరాలకు పంపించి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 699 మందికి కరోనా లేదని నిర్ధారణ అయ్యింది. మరో 28 మంది ఫలితాలు ఇంకా తెలియవలసి ఉంది.

Related Post