కరోనా హైదరాబాద్‌ వచ్చేసిందా?

January 27, 2020
img

చైనాలో పుట్టిన కరోనా వైరస్ హైదరాబాద్‌కు వచ్చేసినట్లే అనిపిస్తోంది. చైనాలో ఉన్నత విద్యలభ్యసించడానికి వెళ్ళిన హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులు కరోనా వైరల్ లక్షణాలు (జలుబు, జ్వరం)తో హైదరాబాద్‌ తిరిగివచ్చారు. వారిలో జూబ్లీ హిల్స్‌కు చెందిన అమర్‌నాధ్ రెడ్డి శనివారం రాత్రి నల్లకుంటలో ఫీవర్ ఆసుపత్రిలో చేరాడు. కరోనా వ్యాధిగ్రస్తుల కోసం ఆసుపత్రిలో ప్రత్యేకంగా కేటాయించిన 7వ వార్డులో అతనిని చేర్చుకొన్నారు. ఆదివారం ఉదయం మరో ఇద్దరు యువకులు అవే లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. ముగ్గురి రక్తనమూనాలను సేకరించి పూణేలోని వైరల్ ల్యాబ్స్ కు పంపించామని ఆసుపత్రి సూపరింటెండెంట్ కే. శంకర్ తెలిపారు. 

ఇదివరకు స్వైన్ ఫ్లూ వ్యాధి హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో పలు జిల్లాలను వణికించింది. ప్రభుత్వం తీసుకొన్న అనేక చర్యలతో స్వైన్ ఫ్లూ అదుపులోకి వచ్చిందనుకొంటే ఇప్పుడు అంతకంటే ప్రమాదకరమైన కరోనా వైరస్ పుట్టుకొచ్చింది. ఇది ప్రధానంగా పాములు, గబ్బిలాలు, కప్పలు కొన్ని రకాల జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. చైనాలో ప్రజలు పాములు, కప్పలను ఆహారంగా తింటుంటారు. కనుక చైనా నుంచే కరోనా వైరస్ ఇతరదేశాలకు వ్యాపించడం మొదలైంది. కనుక చైనా నుంచి భారత్‌ వస్తున్నవారందరికీ విమానాశ్రయాలలోనే వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిసోకినట్లు అనుమానం కలిగితే అక్కడి నుంచి నేరుగా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కనుక ప్రాణాంతకమైన కరోనా వ్యాధి సోకకుండా ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Related Post