పసిపిల్లలకు ట్యాబ్లెట్లు... ఒకరి మృతి

March 08, 2019
img

సాధారణంగా నెలల పిల్లలకు జ్వరం, నొప్పి వస్తే సిరప్ వాడుతారనే విషయం సామాన్యులకు కూడా తెలుసు. కానీ నాంపల్లి పట్టణ ఆరోగ్యకేంద్రంలో పనిచేసే వైద్యులకు, నర్సులకు, పార్మాసిస్టుకు తెలియకపోవడమే విచిత్రం. నాంపల్లి పట్టణ ఆరోగ్యకేంద్రంలో బుదవారం 92 మంది శిశువులకు టీకాలు వేశారు. టీకాలు వేసిన తరువాత సాధారణంగా జ్వరం, నొప్పి వస్తుంటుంది. అది తగ్గేందుకు పారాసిటమాల్ సిరప్ ఇస్తుంటారు. కానీ పెద్దలకు వెన్ను, కీళ్ళ నొప్పులు తగ్గడానికే వాడే ట్రమడాల్ అనే ట్యాబ్లెట్లను వాడమని వైద్యులు ఇచ్చేశారు. పారాసిటమాల్, ట్రమడాల్ మాత్రలు రెండూ ఒకే రంగులో ఉండటంతో పొరపాటున ఇచ్చినట్లు సమాచారం. 

అసలు 2-3 నెలలు వయసున్న పసిపిల్లలకు ట్యాబ్లెట్లు వాడమని చెప్పడమే విచిత్రం అనుకొంటే మళ్ళీ ఒక మాత్రకు బదులు వేరే మాత్రలను అందజేయడం వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనం. పసిపిల్లలను ఇంటికి తీసుకుపోయిన తరువాత వారికి జ్వరం రాగానే వైద్యులు సూచించినట్లు వారికి ట్రమడాల్ మాత్రలను పొడిని నీళ్ళలో కలిపి ఇచ్చారు తల్లితండ్రులు. దాంతో ఆ మాత్రలు మింగిన 31 మంది శిశువులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వెంటనే వారిని పట్టుకొని తల్లితండ్రులు నీలోఫర్ ఆసుపత్రికి పరుగులు తీశారు. వారిలో కిషన్ బాగ్ కు చెందిన ఫయాజ్ అనే రెండు నెలల చిన్నారి తండ్రి చేతుల్లోనే మృతి చెందాడు. మరో ముగ్గురు శిశువుల పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో వారిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన శిశువుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెపుతున్నారు.


విషయం తెలుసుకొన్న వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ హుటాహుటిన నీలోఫర్ ఆసుపత్రికి వచ్చి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. పసిపిల్లల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకొంటామని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అనంతరం సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యి ఈ ఘటనపై చర్చించారు. పట్టణ ఆరోగ్యకేంద్రానికి పారాసిటమాల్ సిరప్ సరఫరా గురించి ఆరా తీశారు. టీకాలు వేయించుకొన్న శిశువులలో 32 మంది మాత్రమే నీలోఫర్ ఆసుపత్రికి వచ్చారు కనుక మిగిలిన 60 మంది శిశువుల ఆరోగ్య పరిస్థితి గురించి తక్షణం తెలుసుకొని తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

Related Post