కంటి వెలుగు పధకానికి సర్వం సిద్దం

August 06, 2018
img

ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగా కళ్ళ పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. బీపి, డయాబెటీస్ వ్యాధులు కూడా కంటి చూపుపై ప్రభావం చూపుతాయి కనుక కంటి పరీక్షలతో పాటు ఆ రెండు పరీక్షలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి వాటి నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తోంది. కంటివెలుగు పధకం క్రింద ఉచితంగా పరీక్షలు నిర్వహించడమే కాకుండా అవసరమైన వారికి మందులు, కళ్ళద్దాలు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. అవసరమైతే రోగులను జిల్లా కేంద్రాలకు తరలించి కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తారు. 

కంటి వెలుగు పధకంలో 744 మంది కంటి వైద్య నిపుణులు, 900 మంది ఆప్టోమెట్రిస్ట్ లు పాల్గొనబోతున్నారు. వీరు కాక అధనంగా మరికొన్ని బృందాలు కూడా పనిచేస్తాయి. ఒక్కో కంటి పరీక్షా శిబిరంలో ఒక వైద్యాధికారితో సహా మొత్తం తొమ్మిది మంది ఉంటారు. అత్యవసర పరిస్థితులలో రోగులను తరలించేందుకు అదనపు సిబ్బంది, అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంటాయి.         

ఈ పధకం కోసం రాష్ట్రప్రభుత్వం సుమారు మూడు కోట్లు విలువైన మందులు, 32 లక్షల కళ్ళద్దాలు, 600 ఆటో రిఫ్రాక్టర్ మీటర్లు వగైరాలు సిద్దంగా ఉంచింది. ఆగస్ట్ 15నుంచి పట్టణాలలో రోజుకు 300, గ్రామాలలో రోజుకు 250 మంది కంటి పరీక్షలు, షుగర్, బీపి పరీక్షలు నిర్వహించనున్నారు. ఏ రోజు, ఏ పట్టణం, ఏ గ్రామంలో కంటి పరీక్షలు నిర్వహించాలో పూర్తి టైం-టేబుల్ కూడా అధికారులు రూపొందించారు. దానిని రెండు మూడు రోజులు ముందుగానే ప్రకటించి ప్రజలకు తెలియజేస్తారు. 

ఒక రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగా బిపి, షుగర్, కంటి పరీక్షలు నిర్వహించడం దేశంలో ఇదే ప్రధమం. ప్రజారోగ్యం విషయంలో తెలంగాణా ప్రభుత్వం కనబరుస్తున్న ప్రత్యేకశ్రద్ధ  చాలా అభినందనీయం. ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయం. 

Related Post