మెట్రో రైల్ సర్వీసు సక్సస్ అయినట్లేనా?

December 11, 2017
img

నవంబర్ 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులకు నగరవాసుల నుంచి మంచి స్పందనే వస్తోంది. మొదటిరోజునే లక్ష మంది ప్రయాణించగా ఆ సంఖ్య నానాటికీ క్రమంగా పెరుగుతోంది. అది మెట్రో నిర్వహణకు చాలా అవసరం కూడా. శని,ఆదివారాలలో మెట్రోలో రోజుకు 1.40-1.50 లక్షల మంది ప్రయాణించినట్లు సమాచారం. వారాంతపు శలవురోజులలోనే ఇంత రద్దీగా ఉన్నందున పనిదినాలలో మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు. అయితే నేటికీ ఉద్యోగులు, రోజువారి ప్రయాణికుల కంటే మెట్రో రైల్ ప్రయాణపు అనుభూతి కోసం ప్రయాణిస్తున్నవారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. శని,ఆదివారాలలో మెట్రోలో ప్రయాణించినవారిలో చాలా మంది మెట్రో స్టేషన్ లో, మెట్రో రైల్లో సెల్ఫీలు తీసుకోవడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 

మెట్రోలో రోజువారి ప్రయాణికుల సంఖ్యపై హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని మెట్రి ఎండి ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు. 

మెట్రో కారిడార్ లో మియాపూర్ నుంచి నాగోల్ వరకు గల అన్ని స్టేషన్లు రద్దీగానే ఉంటున్నాయి. ముఖ్యంగా అమీర్ పేట మెట్రో స్టేషన్ నగరం నడిబొడ్డున ఉన్న కారణంగా అక్కడ తెల్లవారుజాము నుంచి ఆఖరురైలు వెళ్ళేవరకు చాలా రద్దీగా ఉంటోంది. 

ఇక విద్యార్ధులకు సబ్సీడీపై మంత్లీ పాసులు ఇవ్వాలనే డిమాండ్ వినబడుతోంది. అలాగే రోజువారి ప్రయాణికులకు కూడా కొంత తగ్గింపు ధరలపై మంత్లీ పాసులు ఇవ్వాలని ఉద్యోగులు, చిరు వ్యాపారులు కోరుతున్నారు. అలాగే త్రాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ సౌకర్యం కల్పించాలని మెట్రో ప్రయాణికులు కోరుతున్నారు. మెట్రో రైల్ సర్వీసులకు నగరవాసుల నుంచి మంచి స్పందనే వస్తోంది కనుక ఇక గాడినపడినట్లే భావించవచ్చు.    


Related Post