జియో ఫీచర్ ఫోన్స్ వచ్చేస్తున్నాయా?

September 23, 2017
img

జియో ప్రకటించిన 4జి ఫీచర్ ఫోన్స్ బుక్ చేసుకొన్నవారికి వాటిని ఆదివారం నుంచి అందించబోతున్నట్లు అనధికార సమాచారం. సాధారణంగా చిన్న పట్టణాలు, గ్రామాలలో నివసించే ప్రజలు ఎక్కువగా బేసిక్ మోడల్ ఫోన్స్ నే వాడుతుంటారు కనుక మొదటవారికే ఈ ఫోన్లను పంపిణీ చేయాలని జియో భావిస్తున్నట్లు సమాచారం. మొదటి విడతలో 15 రోజుల వ్యవధిలో ఏకంగా 60 లక్షల ఫోన్లను పంపిణీ చేయడానికి సన్నాహాలు పూర్తయినట్లు సమాచారం. అయితే ఈ వార్తను జియో అధికారికంగా ఇంకా దృవీకరించవలసి ఉంది. 

ఈ ఫీచర్ ఫోన్ బుక్ చేసుకొన్నవారు సెక్యూరిటీ డిపాజిట్ గా రూ.1,500 చెల్లించవలసి ఉంటుంది. ఇప్పటికే బుక్ చేసుకొన్నవారు వాటి కోసం రూ.500 అడ్వాన్స్ చెల్లించి ఉంటారు కనుక వారు ఫోన్ అందుకొన్నప్పుడు మిగిలిన రూ.1,000 చెల్లించవలసి ఉంటుంది.  

ఈ 60 లక్షల ఫోన్లు అందుబాటులోకి వచ్చినట్లయితే, అంతమంది జియోలోకి మారిపోతారు కనుక అంతమంది వినియోగదారులను ఇతర టెలికాం కంపెనీలు కోల్పోబోతున్నాయని వేరే చెప్పనవసరంలేదు. ఎందుకంటే, నేటికీ దాదాపు అన్ని టెలికాం కంపెనీలు కోట్లాది 2జి ఖాతాదారులపైనే ఆధారపడున్నాయి. ఈ కొత్త ఫీచర్ 4జి ఫీచర్ ఫోన్స్ మార్కెట్లోకి వచ్చేస్తే 2జి వినియోగదారులు అందరూ జియోలోకి మారిపోవడం ఖాయం. ఇప్పటికే జియో ధాటికి తట్టుకోలేక విలవిలలాడుతున్న టెలికాం కంపెనీలు ఈ దెబ్బను ఏవిధంగా తట్టుకొంటాయో..అసలు తట్టుకోగలవో లేదో..చూడాలి.  

Related Post