అందుకే 2,000 నోట్లు కనబడటం లేదా?

July 26, 2017
img

ఒక సంచలన వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే అది నిజమా కాదా అనేది...ఇంతవరకు ఎవరూ అధికారికంగా దృవీకరించలేదు. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే సుమారు 5నెలల క్రితమే రిజర్వ్ బ్యాంక్ రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసిందిట. అంతే కాదు...ఈ ఆర్ధిక సంవత్సరంలో అంటే వచ్చే మార్చి నెలాఖరు వరకు ఇక రూ. 2,000 నోట్లను ముద్రించకూడదని కేంద్రప్రభుత్వం నిర్ణయించిందిట! వాటికి బదులుగా కొత్తగా రూ.200 నోట్లను ముద్రిస్తోందిట. అవి మరొకటి రెండు నెలలోలోపే మార్కెట్ లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందిట!

కొత్తగా రూ.200 నోట్లను ముద్రిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మార్చి నెలలోనే ప్రకటించారు. కనుక అవి వస్తే ఆశ్చర్యమేమీ లేదు కానీ చెప్పాపెట్టకుండా రూ.2,000 నోట్లను ముద్రించకూడదనే కేంద్రప్రభుత్వం నిర్ణయం నిజమైతే అది మరో సంచలనమైన వార్తే అవుతుంది. దానితో నల్లకుభేరుల గుండెల్లో మళ్ళీ రాళ్ళూ పడక మానవు. గతః ఏడాది నవంబరులో పాతనోట్లను రద్దు చేసి వాటి స్థానంలో 2,000 నోట్లను ప్రవేశపెట్టినప్పుడే ఇటువంటిదేదో జరిగే అవకాశం ఉందని చాలా మంది ఊహించారు. కానీ వచ్చే ఎన్నికల సమయానికి ప్రభుత్వం తన తదుపరి వ్యూహాన్ని అమలు చేస్తుందని అందరూ భావించారు. కానీ కేంద్రప్రభుత్వం ఇప్పటి నుంచే తన వ్యూహాన్ని మెల్లగా అమలు చేస్తున్నట్లుంది. ఏమైనప్పటికీ ఈ వార్త నిజమైతే చాలా సంచలనమైనదేనని చెప్పక తప్పదు.  


Related Post