మిషన్ జియోతో ఏమి కాబోతోంది?

July 24, 2017
img

దేశంలో సంచలనమో లేక విద్వంసమో సృష్టిస్తున్న జియో మరో సరికొత్త మిషన్ అమలుచేయడానికి సిద్దం అయినట్లు తెలుస్తోంది. తమకు అవకాశం కల్పిస్తే దేశంలో ఉన్న  3 కోట్ల కాలేజీలలో ఉచిత వైఫై అందించడానికి సిద్దంగా ఉన్నమని కేంద్ర మానవ వనరుల శాఖకు జియో ప్రతినిధి తెలిపినట్లు సమాచారం. మొదటి దశలో దేశవ్యాప్తంగా ఒకేసారి 38,000 కాలేజీలకు తరువాత అంచెలవారిగా మిగిలిన కాలేజీలన్నిటికీ ఉచిత వైఫై అందిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎలాగూ దేశమంతటినీ ఇంటర్నెట్ తో అనుసంధానం చేయాలని ప్రయత్నిస్తున్నాయి కనుక జియో ప్రతిపాదనను తిరస్కరించడానికి బలమైన కారణాలు ఏవీ కనిపించడం లేదు. కనుక జియోకు ఈ అవకాశం దక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

ఈ దెబ్బతో దేశంలో కాలేజీ విద్యార్ధులు, అధ్యాపకులు, వాటిలో ఉద్యోగులు అందరూ జియోలోకి జంప్ అయిపోవడం ఖాయం అని చెప్పవచ్చు. దేశంలో ఉన్న అన్ని నెట్ వర్క్ ఆపరేటర్లకు విద్యార్ధులు, యువతే ప్రధాన ఖాతాదారులని వేరేగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే జియో దెబ్బలను తట్టుకోలేక విలవిలలాడుతున్న ఇతర నెట్ వర్క్ ఆపరేటర్లు     కనుక తమ ప్రధాన వినియోగదారులను పోగొట్టుకొంటే ఇంకా వారి పని సరి. 

ఈ వ్యూహాలతో  జియో తన ప్రత్యర్ధులను ఎలాగూ చావుదెబ్బ తీయవచ్చు కానీ తన స్వార్ధ వ్యాపార ప్రయోజనాల కోసం విద్యార్ధులకు ఉచిత వైఫై అందించడం ద్వారా వారినీ వారి చదువుల నుంచి పక్కదారి పట్టించే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రభుత్వాలు అనాలోచితంగా స్కూళ్ళు, కాలేజీలకు ఉచిత వైఫై సౌకర్యం కల్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. దాని వలన ప్రభుత్వాలు ఏమి ఆశిస్తున్నాయో తెలియదు కానీ విద్యార్ధులు అశ్లీల చిత్రాలు, వీడియోలు చూడటం పెరిగిందని అనేక సర్వేలలో బయటపడింది. కనుక ఈ వ్యాపార వ్యూహం ఒక సామాజిక విద్వంసానికి ఆరంభం అని చెప్పక తప్పదు. విద్యార్ధులు పరీక్షలలో పాస్ అవడం కంటే ఈ ఆకర్షణలను తట్టుకొని, తమ బలహీనతలను జయించమే వారికి అగ్నిపరీక్షలుగా మారవచ్చు. స్కూళ్ళు, కాలేజీలలో ఫ్రీ వైఫ్ ఇవ్వనంత మాత్రాన్న పిల్లలు చెడిపోకుండా ఉంటారా? అంటే ఉండకపోవచ్చు కానీ వారు చెడిపోయేందుకు మనమే ఎక్కువ అవకాశాలు కల్పించడం తప్పు. 


Related Post